చైనాకు అదిరిపోయే కౌంటరిచ్చిన అమిత్‌ షా.. 

Amit Shah Serious Warning To China Over Arunachal Amid - Sakshi

భారత్‌ అంతర్గత విషయంలో డ్రాగన్‌ కంట్రీ చైనా మరోసారి తలదూర్చింది. ఈసారి ఏకంగా కేంద్రహోం మంత్రి అమిత్‌ షా పర్యటనపై అక్కస్సు వెళ్లగక్కింది. ఆ ప్రాంతం చైనాకు చెందినది అని.. అక్కడ అమిత్‌ షా పర్యటించకూడదు అంటూ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో చైనాకు అమిత్‌ షా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరు అంటూ కామెంట్స్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. అమిత్‌ షా సోమవారం ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో అరుణాచల్ సరిహద్దు గ్రామం, భారతదేశానికి తూర్పు వైపున ఉన్న కిబితూ నుంచి 'వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్'ను ప్రారంభించారు. ఈ సందర్బంగా అమిత్‌ షా పర్యటనపై చైనా వివాదాస్పద ‍వ్యాఖ్యలు చేసింది. ఆయన పర్యటనను చైనా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. ‘జాంగ్నాన్ అనేది చైనా భూభాగం అని అన్నారు. ఈ ప్రాంతంలో భారత అధికారుల కార్యకలాపాలు చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇవి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు అనుకూలంగా లేవు. మేము దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాము అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక, ఈ వాదనను భారత్‌ తోసిపుచ్చింది. 

ఈ క్రమంలో అరుణాచల్‌ పర్యటన సందర్భంగా అమిత్‌ షా.. చైనాకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అమిత్‌ షా మాట్లాడుతూ.. భారత ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరు. మన దేశ భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేరు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఇదే సమయంలో దేశసరిహద్దులో మన జవాన్లు అందిస్తున్న సేవలను కొనియాడారు. వారు పగలు, రాత్రి శ్రమిస్తున్నందనే దేశ ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అలాగే, మోదీ ప్రధాని అయ్యాకే ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి జరుగుతోందని, దేశాభివృద్ధికి దోహదపడే ప్రాంతంగా పరిగణించబడుతోందన్నారు. 

ఇదిలా ఉండగా.. గత వారం చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. అరుణాచల్‌లోని పలు ప్రాంతాలు తమ దేశానికి చెందినవి అంటూ వాటి పేర్లను మార్చింది. దక్షిణ టిబెట్‌గా చెప్పుకునే అరుణాచల్ ప్రదేశ్‌లోని మరో 11 ప్రదేశాలకు.. చైనా పేర్లను బీజింగ్ ప్రకటించింది. దీన్ని భారత్‌ తీవ్రంగా తప్పుబట్టింది.  చైనా పేర్లు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. చైనా ఇటువంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. చైనా కవ్వింపులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 

  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top