నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత (ఎన్‌సీపీ), మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ దాదా అని ముద్దుగా పిలుచుకునే కార్యకర్తలు, అభిమానులు ఇక ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు నాలుగు దశాబ్దాలుగా ఆయనతో అనుబంధం ఉన్న నేతలు కూడా బోరున విలపిస్తున్న దృశ్యాలు నెట్టింట కనిపిస్తున్నాయి.
అయితే గతంలోనూ అజిత్ పవార్‌కు ఓ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని చాలాకాలం ఆయన ఎవరికీ చెప్పలేదు. చివరకు తన సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా తెలియజేశారాయన. పైగా ఈ విషయాన్ని అప్పటిదాకా తన భార్య, తల్లికి కూడా ఆయన చెప్పలేదట. ముందే అందరికి చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదంటూ చమత్కరించారు. పైగా ఆయన ఈ ఘటన గురించి సరదాగా చెబుతుంటే అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు.
అసలేం జరిగిందంటే..
ఓ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమం కోసం ఆయన వెళ్లారట. ఆ సమయంలో ఆయన ఎక్కిన లిఫ్ట్ 4వ అంతస్తు నుంచి పడిపోయింది. అదే లిఫ్ట్‌లో అజిత్ పవార్‌తోపాటు, ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు కూడా ఉన్నారట. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అదేసమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తర్వాత తేలింది. అదృష్టవశాత్తూ.. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
ఈ ఘటనపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘ ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో భవనం లోని మూడో అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు మెట్ల ద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యాం. అయితే మాతో పాటు 90 ఏళ్ల డాక్టర్ ఉండడంతో మేం లిఫ్ట్ ఎక్కాం. నాల్గవ అంతస్తుకి లిఫ్ట్‌లో వెళుతుండగా అకస్మాత్తుగా కరెంటు పోయింది. చుట్టూ చిమ్మచీకటి. అదే సమయంలో నాల్గో అంతస్తు నుంచి లిఫ్ట్ హఠాత్తుగా నాలుగో అంతస్తునుంచి కిందకు పడిపోయింది. నాతో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరిచి నన్ను బయటకు లాగాడు. ఆ తర్వాత డాక్టర్‌ను కాపాడాం. నాకు ఎలాంటి గాయాలు కాలేదు. డాక్టర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి..
.. ఇదేదో కథకాదు. నేను అబద్ధం చెప్పడం లేదు. మాకు ఏమైనా అయ్యింటే ఈ రోజిది శ్రద్ధాంజలి కార్యక్రమంగా అయుండేది. ఈ విషయం నేను దాచుకోలేకపోతున్నాను.. మీరు కూడా నా కుటుంబ సభ్యులే. అందుకే ఈ విషయం మీతో చెప్పాను’ అని అజిత్ పవార్ అన్నారు. 2023 జనవరి 16న మహారాష్ట్రలోని పూణెలో హార్దికర్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.


