
ఇండియా కూటమిలో లేము: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. ఈ నెల 21 నుంచి మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా పక్షాలు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ భేటీకి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే శనివారం ఏర్పాటు చేసిన భేటీకి దూరంగా ఉండనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
‘‘ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చామని మా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ కూటమి కేవలం గత లోక్‌సభ ఎన్నికల దాకానేనని కూడా ఆయన అప్పుడే చెప్పారు. కనుక ఇండియా కూటమిలో ఆప్ ఇంకెంత మాత్రమూ భాగం కాదు. టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు మాకు మద్దతిస్తున్నందున పార్లమెంటులో వారితో అంశాలవారీగా సమన్వయాన్ని కొనసాగిస్తాం’ అని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ తెలిపారు. బిహార్, యూపీ, పూర్వాంచల్‌లో బుల్డోజర్ రాజ్యం, ఢిల్లీలో పేదల ఇళ్ల కూల్చివేతలపై కేంద్రాన్ని ఆప్ నిలదీస్తుందన్నారు.
కూటమి బలహీనం
గత లోక్‌సభ ఎన్నికల అనంతరం హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుంటుందని భావించినా సీట్ల పంపకాల్లో విభేదాలతో అది జరగలేదు. ఆ తర్వాత పంజాబ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో కూడా ఆప్ ఒంటరిగానే పోటీ చేసింది. గుజరాత్‌లో విశావదర్ ఉప ఎన్నికల్లో ఆప్ విజ యం తర్వాత కేజ్రీ వాల్ మాట్లాడుతూ, ఇండియా కూటమి కేవలం గతేడాది లోక్‌సభ ఎన్నికలకు ఉద్దేశించినది మాత్రమే నన్నారు. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు లేదు. బిహార్ సహా అన్ని ఎన్నికల్లోనూ ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుంది’’ అని ప్రకటించారు. దానిపై పార్టీ తాజాగా మరింత స్పష్టత ఇచ్చింది.
ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో విపక్షాల స్వరం నానాటికీ మరింత బలహీనపడుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆప్‌కు ప్రస్తుతం లోక్‌సభలో 3, రాజ్యసభలో 8 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ బయటకు రావడం విపక్ష ఐక్యతకు పెద్ద దెబ్బే కానుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, పాక్‌తో కాల్పుల విరమణలో అమెరికా జోక్యం, మనపై ఆ దేశ సుంకాలు, బిహార్‌లో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పలు అంశాలపై వర్షాకాల సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో కీలక బిల్లులపై ఓటింగ్ జరిగే పక్షంలో ఆప్ లేకపోవడం ఇండియా కూటమికి సంఖ్యాపరంగా ఇబ్బందిగా మారనుంది.