
జైపూర్: దేశంలో ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ముక్కుపచ్చలారని తొమ్మిదేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలొదిలింది. ఈ ఉదంతం గుండెపోటు మరణాలపై మరోమారు ఆందోళనను రేకెత్తించింది.
ప్రాచీ కుమావత్.. వయసు తొమ్మిదేళ్లు.. సికార్‌లోని దంతా పట్టణంలో 4వ తరగతి చదువుతోంది. ఎంతో ఆరోగ్యంగా కనిపించే ఈ చిన్నారి పాఠశాల విరామ సమయంలో భోజనానికి కూర్చుంది. టిఫిన్ డబ్బా తెరుస్తూ స్పృహ కోల్పోయింది. వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు బాధితురాలిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆ చిన్నారిని బతికించేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. వైద్యుల పరీక్షలో ఆ చిన్నారికి పల్స్ అందలేదు.. రక్తపోటు పడిపోయింది. ఊపిరి ఆగిపోయింది. ఇవన్నీ గుండెపోటు లక్షణాలని వైద్యులు గుర్తించారు.
జలుబు కారణంగా ప్రాచీ రెండు మూడు రోజులుగా పాఠశాలకు హాజరు కాలేదని ఆదర్శ్ విద్యా మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్ నంద్ కిషోర్ తివారీ మీడియాకు తెలిపారు. తిరిగి ఆ చిన్నారి పాఠశాలకు వచ్చినప్పుడు ఆరోగ్యంగానే ఉందని, ఉదయం ప్రార్థనలు, అసెంబ్లీలో కూడా పాల్గొన్నదని, భోజన సమయంలో స్పృహ కోల్పోయిందని తెలిపారు. వెంటనే సీపీఆర్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని, తరువాత దంతాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లామని నందకిశోర్ వివరించారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్‌ఛార్జి డాక్టర్ డాక్టర్ ఆర్‌కె జాంగిద్ మీడియాతో మాట్లాడుతూ బాధిత చిన్నారిని బతికించేందుకు దాదాపు గంటన్నర పాటు ప్రయత్నించామని తెలిపారు. తరువాత మెరుగైన వైద్యం కోసం సికార్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే పోస్ట్‌మార్టం నిర్వహించకుండా ఆ చిన్నారి గుండెపోటుతో మృతిచెందిందని ఖచ్చితంగా నిర్ధారించలేమని, ఆ చిన్నారికి పుట్టుకతోనే గుండె జబ్బు ఉండే అవకాశం ఉందని, దానిని తల్లిదండ్రులు గుర్తించకపోయి ఉండవచ్చని డాక్టర్ జాంగిద్ అన్నారు.