ముగ్గురి పరిస్థితి విషమం.. ఉత్తరప్రదేశ్‌లో ఘటన

6 killed in road accident in Jalalpur: Modi Express Condolence - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరి అంత్యక్రియలకు వెళ్లొస్తూ ఆరుగురు అనంతలోకాలకు చేరారు. ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి విషమంగా ఉండగా మిగతా 8 మంది స్వల్ప గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రక్కు, వ్యాన్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‌దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

యూపీలోని జౌన్‌పూర్ జిల్లా ఖ్వాజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జలాల్‌పూర్ నివాసి థన్దేయి, స్వజోఖన్ యాదవ్ భార్యాభర్తలు. థన్దేయికి 112 ఏళ్లు ఉంటాయి. అయితే ఆయన భార్య స్వజోఖన్ యాదవ్ మృతి చెందింది. వారికి కుమారులు లేకపోవడంతో వారి అల్లుడు లక్ష్మీశంకర్ యాదవ్ వచ్చి వారణాసిలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చాడు. అయితే వచ్చేప్పుడు తన గ్రామంలోని 17 మందిని వ్యాన్‌లోకి ఎక్కించుకుని తీసుకువచ్చాడు. వారణాసిలో దహన సంస్కారాలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

జౌన్‌పూర్- వారణాసి రహదారిలో జలాల్‌పూర్‌కు చేరుకోగానే ట్రక్కు, ఈ వ్యాన్‌ రెండూ ఢీకొన్నాయి. దీంతో  వ్యాన్‌లోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ వ్యాన్‌లో మొత్తం 17 మంది ప్రయాణిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ​ కూడా సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top