
రాష్ట్రంలో గుండెపోట్లతో 7 మంది మృతి
బాధితుల్లో యువతీ యువకులు
కుటుంబాలు కన్నీరుమున్నీరు
కర్ణాటక: రాష్ట్రంలో గుండెపోటు మరణాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. తమ ఆప్తులు కళ్లముందే తిరిగి రాని లోకాలకు వెళ్తుంటే కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత 24 గంటల్లో పలు జిల్లాలలో 7 మంది వరకూ హఠాన్మరణం పాలయ్యారు. కలబుర్గి జిల్లా చించోళి తాలూకా చందనకేరాలో మెహసిన్ ఒశా పటేల్ (22) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలాడు. ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. ఇతనికి గత నెల 15న పెళ్లయింది. ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబీకులు విలపించారు. కాగా, కలబురగి జిల్లా వ్యాప్తంగా ఆరు నెలల నుంచి గుండెసమస్యలతో 40 మంది వరకు చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో 15 మంది 45 ఏళ్ల లోపువారు.
సివిల్స్ కలలు భగ్నం
హుబ్లీ: సివిల్స్ పరీక్షల్లో పాస్ కావాలి, ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలనేది ఆమె కల. కానీ మాయదారి గుండెపోటు ఆ కలల్ని ఛిద్రం చేసింది. బుధవారం ధార్వాడ పురోహిత నగరలో జీవిత కుసగూర (26) అనే విద్యావంతురాలు ఆకస్మికంగా మరణించింది. ఉదయం ఇంట్లో ఉండగా తల తిప్పినట్లుగా ఉందని చెబుతూ కూర్చుండిపోయింది. కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే శ్వాస వదిలింది. ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా గుండెపోటుతో మరణించిందని ప్రకటించారు. ఎంఎస్‌సీ అగ్రిక ల్చర్ చదువుతున్న జీవిత యూపీఎస్‌ఈ పరీక్షలు రాసి ఐఏఎస్ అధికారి కావాలని కలలు కంది. ఈమె తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. బిడ్డ చిరుప్రాయంలోనే మృత్యువాత పడటంతో కన్నీటి సంద్రంలో మునిగి పోయారు.
పారిశ్రామికవేత్త కొడుకు..
దావణగెరె నగరంలోని జయనగరలో పారిశ్రామికవేత్త రేఖా ముర్గేశ్ కొడుకు అక్షయ్ (22) ఇంటిలో గుండెపోటుతో కిందపడి మరణించాడు. ఇతడు కాలేజీలో చదివేవాడు. ఎలాంటి అనారోగ్యం లేదని తెలిసింది.
బెళగావిలో రైతు..
బెళగావి జిల్లా సవదత్తి పట్టణంలోని ఎపిఎంసీలో వాహన డ్రైవర్ అశోక్ జీరిగవాడ (40) కుప్పకూలి మృతి చెందారు. రైతు అయిన అశోక్ తన పొలంలో పెసర్లను అమ్మడానికి వచ్చి ప్రాణాలు విడిచాడు.
కనకపురలో అటవీ ఉద్యోగి
కనకపుర తాలూకా కోగ్గె దొడ్డి గ్రామానికి చెందిన మాదేశ్ నాయక్ (30) ఫారెస్ట్ గార్డ్‌గా పని చేస్తున్నాడు. ఒక్కసారిగా ఎద నొప్పి వచ్చి కింద పడి మృతి చెందారు.
తరగతిలో బాలుడు..
చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా కురుబగెరి గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్న మనోజ్‌కుమార్ (9) అనే బాలుడు తరగతిలోనే కన్నుమూశాడు. పాఠం వింటూ కుప్పకూలాడు. మనోజ్ ఇప్పటికే గుండెలో రంధ్రం పడి చికిత్స పొందుతున్నాడు.
అవుల కాపరి..
బెంగళూరు దక్షిణ జిల్లా గోల్లరదొడ్డికి చెందిన పశువుల కాపరి గిరీశ్ (25) గుండెపోటుకు బలయ్యాడు. గత మూడు రోజుల నుంచి గిరీశ్ ఎద నొప్పి అని కుటుంబీకులకు చెప్పేవాడు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించాడు.