న్యూఢిల్లీ: వీధి శునకాల సంతతి వృద్ధిని కట్టడిచేసే లక్ష్యంతో వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలంటూ తాము గతంలో ఇచ్చిన తీర్పును చాలా రాష్ట్రాలు గాలికొదిలేశాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు సహాయకులుగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రాలు ఏ మేరకు క్షేత్రస్థాయిలో అమలుచేస్తున్నాయో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాల ధర్మాసనానికి నివేదించారు.
ఈ సందర్భంగా ‘జంతువుల జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. వీధి శునకాలకు కు.ని. ఆపరేషన్లు చేయాలని సూచించారు. వాటికి షెల్టర్లను నిర్మించాలని ఆదేశించారు. ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోకి వీధికుక్కలు రాకుండా కంచెలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఇవేమీ రాష్ట్రాలు సరిగా అమలుచేయట్లేదు’’ అని గౌరవ్ వెల్లడించారు. రాష్ట్రాల నిర్లక్ష్య వైఖరిపై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.
మేం ఇచ్చిన తీర్పును అమలుచేసే కర్తవ్యాన్ని రాష్ట్రాలు గాలికొదిలేసి గాల్లో కోటలు కడుతున్నాయి. కథలు చెబుతున్నాయి. అస్సాం మినహా ఏ రాష్ట్రం కూడా కుక్కకాటు ఘటనలు ఎన్ని జరిగాయో నమోదుచేయలేదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను గురువారం కోర్టుకు నివేదిస్తానని గౌరవ్ అగర్వాల్ చెప్పారు.


