ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి
బస్సును పక్కకు నిలిపి.. ప్రయాణికులను కాపాడి..
ఆస్పత్రికి వెళ్తుండగా డ్రైవర్ మృతి
చౌటుప్పల్: హఠాత్తుగా ఆ బస్సు డ్రైవర్ గుండెలో అలజడి మొదలైంది.. మృత్యువు తనను కబళించడానికి సిద్ధంగా ఉందని అతనికి అర్థమైంది. కానీ, బస్సులో ప్రయాణికుల క్షేమమే లక్ష్యమైంది. తనను నమ్ముకున్న వారు సురక్షితంగా గమ్యం చేరాలని తపించిన ఆ డ్రైవర్ పోరాటం చివరికి విషాదాంతంగా మిగిలింది. తమ ప్రాణాలు కాపాడిన డ్రైవర్ మరణంతో ప్రయాణికుల గుండె బరువెక్కింది. విజయవాడ సమీపంలోని కామయ్యతోపు ప్రాంతానికి చెందిన కట్టవరపు నాగరాజు (40), విజయవాడ–1 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి గరుడ బస్సులో ప్రయాణికులతో బయలుదేరి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.
తిరిగి మధ్యాహ్నం మియాపూర్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని విజయవాడకు బయలుదేరారు. ఎల్బీనగర్ దాటిన తర్వాత నాగరాజుకు ఛాతీలో నొప్పి మొదలైంది. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద బస్సు ఆపి, మెడికల్ షాపులో ట్యాబ్లెట్లు కొనుగోలు చేసి వేసుకున్నారు. అయితే చౌటుప్పల్ వచ్చేసరికి నొప్పి మళ్లీ తీవ్రమైంది. ఆ స్థితిలో కూడా ఎంతో బాధ్యతగా బస్సును సురక్షితంగా బస్టాండ్‌లోకి మళ్లించి, సర్వీస్ రోడ్డులో నిలిపివేశారు.
చివరి శ్వాస వరకు బాధ్యత
బస్సు ఆపిన తర్వాత ప్రయాణికులకు విషయం చెప్పి, వారు వేరే బస్సులో వెళ్లాలని సూచిస్తూ బస్సు నంబర్, ఇతర వివరాలను స్వయంగా వివరించారు. అనంతరం ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్తుండగా.. మార్గంమధ్యలోనే కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొదటిసారి నొప్పి వచ్చినప్పుడే చికిత్స పొంది ఉంటే ప్రాణాలు దక్కేవని వైద్యులు అభిప్రాయపడ్డారు. బస్సు అటెండర్ ముదిగంటి చంద్రారెడ్డి నుంచి ఆర్టీసీ అధికారులు వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


