సాక్షి, భువనగిరి జిల్లా: చౌటుప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. నాగరాజు అనే అమరావతి APSRTC డ్రైవర్ దురదృష్టవశాత్తు గుండెపోటుతో మృతిచెందారు. మియాపూర్ నుండి విజయవాడ వెళుతున్న ఏపీఎస్సార్టీసీ బస్సు డ్రైవర్ నాగరాజుకు చౌటుప్పల్ వద్ద గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ఆ నొప్పిని భరిస్తూ బస్సును పక్కకు ఆపారు. దీంతో హుటాహుటీన చికిత్స నిమిత్రం ఆటోలో అక్కడి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆ సమయంలో అక్కడ డాక్టర్లు లేకపోవడంతో వెంటనే అక్కడి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే బాధితుడిని పరీక్షించిన డాక్టర్లు నాగరాజు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. అయితే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిన సమయంలో బస్సులో 18మంది ప్రయాణికులు ఉన్నారు. ఆయన అప్రమత్తతతో వారికి పెను ప్రమాదం తప్పింది.


