
ఎడతెగని వానలతో హిమాచల్‌లో స్తంభించిన జనజీవనం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపు రాష్ట్రమంతటా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. కనీసం 130 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వరద చేరడం, ధ్వంసం కావడం వంటి కారణాలతో 250 రోడ్లను అధికారులు మూసివేశారు. ఇందులో అత్యధికంగా సిర్మౌర్ జిల్లాలో 57, మండి జిల్లాలో 44 రోడ్లున్నాయి. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడే అవకాశమున్న 22 ప్రాంతాలకుగాను 18 చోట్ల ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. కంగ్రా, మండి, సిర్మౌర్, సొలాన్ జిల్లాల్లో సోమవారం స్కూళ్లను మూసివేశారు.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పర్యాటక ప్రాధాన్యమున్న సిమ్లా–కల్కా రైలు మార్గంపైన చేరిన రాళ్లు, చెట్లను తొలగించే రాకపోకలకు వీలు కల్పించారు. గత 24 గంటల్లో చనిపోయిన ముగ్గురితో కలిపి ఈ సీజన్‌లో వర్షాల సంబంధిత ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20కి చేరిందని అధికారులు తెలిపారు. సిమ్లా–కల్కా ఐదో నంబర్ జాతీయ రహదారిపై కోటి సమీపంలో కొండచరియలు విరిగి పడటంతో గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి.