
మధ్యప్రదేశ్ స్కూల్‌లో అధికారుల అంకెల గారడీ
భోపాల్: దేశంలో రకరకాలుగా అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి. కానీ, ఇంతటి విడ్డూరాన్ని ఎన్నడూ చూడలేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు జనం. మధ్యప్రదేశ్‌లోని షహ్‌డోల్ జిల్లాలో వెలుగుచూసిందీ అంకెల గారడీ. బియోహరి అసెంబ్లీ నియోజకవర్గంలోని సకండి గ్రామ ప్రభుత్వ పాఠశాల గోడకు నాలుగు లీటర్ల రంగు వేసేందుకు ఏకంగా 168 మంది కూలీలు, 65 మంది తాపీ పనివారిని వినియోగించారు.
ఇందుకోసం కాంట్రాక్టర్ రూ.1.07 లక్షల బిల్లు చేశాడు. ఎలాంటి పరిశీలనలు లేకుండానే అధికారులు సంతకాలు చేయడం, నగదు డ్రా చేసుకోవడం జరిగిపోయాయి. ఇలాంటిదే మరోటి..నిపనియా గ్రామంలోని స్కూలుకు 10 కిటికీలు, నాలుగు తలుపులకు 20 లీటర్ల రంగు వేసేందుకు 275 మంది కార్మీకులను, 150 మంది తాపీ పనివారిని పెట్టుకున్నారట. వీరికోసం కాంట్రాక్టర్ రూ.2.3 లక్షల మేర బిల్లు కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు ఓకే చెప్పేశారు.
స్కూలు భవనం గోడలపై కనిపించాల్సిన వీరి పనితనం..ఉత్తుత్తి లెక్కలు రాయడంలో రాటుదేలింది. సుధాకర్ కన్‌స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఇలాంటి కాకి లెక్కలు చూపి మే 5వ తేదీన బిల్లు చేసింది. ఈ బిల్లును ఏప్రిల్ 4వ తేదీనే స్కూలు ప్రిన్సిపాల్ ఓకే చేసినట్లు రికార్డుల్లో ఉంది. రంగు వేయడానికి ముందు, తర్వాత ఫొటోలను బిల్లులకు జత చేయడం తప్పనిసరి. ఏ ఫొటోలు లేకుండానే ఈ కంపెనీకి బిల్లులు మంజూరైపోవడం మరో ఘనత.
బిల్లుల వ్యవహారం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ మర్పంచి స్పందిస్తూ... సకండి, నిపనియా స్కూళ్లకు వేసిన రంగుల బిల్లు వ్యవహారం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దర్యాప్తు చేపట్టి, బాధ్యులైన వారిపై చర్యలుతీసుకుంటాం’అంటూ ముక్తసరిగా చెప్పేయడం విశేషం.