వెనకబడ్డ తరగతుల జడ్జిలు... హైకోర్టుల్లో 15 శాతమే

15percent Judges To High Courts From Backward Communities In 5 Years - Sakshi

పార్లమెంటు సంఘానికి న్యాయ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో వెనుకబడిన తరగతులకు చెందినవారు కేవలం 15 శాతం మందే ఉన్నారని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ వెల్లడించింది. బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీని నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ విషయాన్ని నివేదించింది. జడ్జిలను నియమించే అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియంకు కట్టబెట్టి 3 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ హైకోర్టుల్లో బీసీ జడ్జిల సంఖ్య పెరగడం లేదని స్పష్టంచేసింది. జడ్జిలుగా ఎవరిని నియమించాలన్నది కొలీజియమే తేలుస్తుందని గుర్తుచేసింది.

కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను మాత్రమే ప్రభుత్వం ఆమోదించగలదని వెల్లడించింది. న్యాయస్థానాల్లో సామాజిక వైవిధ్యాన్ని ఇంకా సాధించలేకపోయామని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలతోపాటు మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరచుగా కొలీజియంను కోరుతూనే ఉందని వివరించింది. 2018 నుంచి 2022 డిసెంబర్‌ 19 వరకూ హైకోర్టుల్లో 537 మందిని జడ్జిలుగా నియమించగా, వీరిలో 1.3 శాతం మంది ఎస్టీలు, 2.8 శాతం మంది ఎస్సీలు, 11 శాతం మంది ఓబీసీలు, 2.6 శాతం మైనారిటీలు ఉన్నారని తెలియజేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top