నవజాత శిశువులకు.. ప్రాణసంకటం | - | Sakshi
Sakshi News home page

నవజాత శిశువులకు.. ప్రాణసంకటం

Nov 16 2026 1:14 AM | Updated on Nov 16 2026 1:14 AM

పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న జనరల్‌ ఆస్పత్రిలో నవజాత శిశువులకు సరైన వైద్యం అందక ఇక్కట్లు పడుతున్నారు. స్థానిక ఆస్పత్రిలో ప్రసవం అయ్యే వారితోపాటు ఇతర జిల్లాల నుంచి మెరుగైన వైద్యసేవల కోసం రెఫరల్‌ కేసులు జనరల్‌ ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూకు వస్తుంటాయి. వీరందరికీ ఆధునిక వైద్య సేవలు అందాల్సి ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.. తక్కువ పడకలు ఎక్కువ కేసులు ఉండటం వల్ల తరుచుగా పడకలకు పోటీ నెలకొంటుంది.

22 పడకలు మాత్రమే..

జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ప్రతిరోజు 25 నుంచి 30 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇందులో ఐదుగురి నుంచి ఆరుగురు నవజాత శిశువులకు ఎస్‌ఎన్‌సీయూ సేవలు అవసరమవుతాయి. దీనికితోడు ఇతర నాలుగు జిల్లాల్లో ఉన్న జనరల్‌ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయిన తర్వాత హైరిస్క్‌ నవజాత కేసులను సైతం ఇక్కడికే తరలిస్తున్నారు. దీంతో రెఫరల్‌ కేసులు అధికం కావడంతో పడకలు దొరకడం కూడా సమస్యగా మారింది. దీనికితోడు జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూలో 22 పడకలు ఉంటే.. ఇందులో రేడియంట్‌ వార్మర్లు 12, ఆక్సిజన్‌ సీపాప్‌ థెరపీ 9, వెంటిలేటర్స్‌ 2 మాత్రమే ఉన్నాయి. పడకలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా సమస్యలకు కారణమవుతోంది. ప్రతిరోజు పడకల కోసం కొందరు ఇక్కడే ఎదురుచూపులు చూడగా మరికొందరు శిశువులను బయట ప్రైవేట్‌ ఎన్‌ఐసీయూ కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో నవజాత శిశువులకు సరైన చికిత్స అందకపోవడంతో ప్రతి నెలలో 10 నుంచి 15 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో హైరిస్క్‌ కేసులతోపాటు నెలలు నిండని శిశువులు, బరువు తక్కువ ఉన్న కేసులే అధికంగా ఉంటున్నాయి.

11 నెలల వ్యవధిలో..

ఎస్‌ఎన్‌సీయూలో ఆశించిన మేర వసతులు లేకపోవడం నవజాత శిశువులకు ప్రాణ సంకటంగా మారింది. ఈ విభాగంలో ఉన్న పడకలు, వార్మర్లు దాదాపుగా ఖాళీ లేకపోవడంతో వివిధ సమస్యలతో జన్మించిన నవజాత శిశువులను వైద్యులు బయటకు రెఫర్‌ చేస్తున్నారు. గత 11 నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో దాదాపు వందకుపైగా శిశువులను రెఫర్‌ చేశారు. నిరుపేదలైన ఆయా కుటుంబాలు తమ పిల్లలను కాపాడుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

● స్పెషల్‌ న్యూబర్న్‌కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ) అనేది పుట్టిన వెంటనే అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు ప్రత్యేక చికిత్స అందించే విభాగం. నవజాత శిశువుల మరణాలను తగ్గించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో జనరల్‌ ఆస్పత్రిలో ఈ విభాగం ఏర్పాటు చేశారు. పుట్టినప్పటి నుంచి 28 రోజుల లోపు ఉన్న శిశువులకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే చికిత్స అందిస్తారు. ఇందులో ప్రధానంగా 1.8 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న శిశువులు, 34 వారాల కంటే ముందే జన్మించిన శిశువులు, పుట్టిన వెంటనే ఏడవకపోవడం లేదా వేగంగా శ్వాస తీసుకోవడం, రక్తంలో బిలిరుబిన్‌ స్థాయి ప్రమాదకరంగా పెరిగినప్పుడు, రక్తంలో లేదా శరీరంలో తీవ్రమైన బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకినప్పుడు, మూర్చ, రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం, శరీర ఉష్ణోగ్రత మరీ తగ్గడం వంటి సందర్భాల్లో ఎస్‌ఎన్‌సీయూ సేవలు అవసరమవుతాయి. దీనికంటే అడ్వాన్స్‌ సేవలు అయిన ఎన్‌ఐసీయూ కేంద్రం స్థానికంగా లేకపోవడం పెద్ద లోటు.

నెల ఓపీ అడ్మిషన్స్‌ మరణాలు

జూలై 113 15

ఆగస్టు 153 12

సెప్టెంబర్‌ 165 13

అక్టోబర్‌ 123 11

మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌ ఎస్‌ఎన్‌సీయూలో

సరిపోని పడకలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా

ఇక్కడికే రెఫరల్‌ కేసులు

ప్రతినెలా 10 నుంచి

15 వరకు శిశు మరణాలు

కలగానే మారిన అడ్వాన్స్‌డ్‌ ఎన్‌ఐసీయూ సేవలు

ఉన్నతాధికారుల దృష్టికి..

జనరల్‌ ఆస్పత్రిలో ఉన్న ఎస్‌ఎన్‌సీయూకు ఇతర జిల్లాల నుంచి రెఫరల్‌ కేసులు ఎక్కువగా వస్తుండటంతో పడకలు సరిపోక సమస్యలు వస్తున్నాయి. నెలలు నిండకపోవడంతో బరువు తక్కువగా ఉన్న పిల్లలు అధికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి శిశువులే ఎస్‌ఎన్‌సీయూలో అడ్మిట్‌ అవుతున్నారు. ఇటీవల జనరల్‌ ఆస్పత్రితోపాటు పీహెచ్‌సీల్లో జరిగిన శిశు మరణాలపై సమీక్షించి వాటిపై ఒక నివేదిక తయారు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. జనరల్‌ ఆస్పత్రిలో ఎన్‌ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేయడానికి సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో కొత్తగా అందుబాటులోకి తీసుకురావడం లేదు. వెయ్యి పడకల ఆస్పత్రి ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న ఎంసీహెచ్‌ భవనం పూర్తిగా డెలివరీలతోపాటు ఎన్‌ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది.

– శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ,

మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement