● నేటి ఉద్దాల ఉత్సవానికి
697 మంది పోలీసులతో బందోబస్తు
మహబూబ్‌నగర్ క్రైం/ చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి జాతర కోసం జిల్లా పోలీస్ శాఖ భారీ పోలీస్ బందోబస్తు కల్పించింది. ఉద్దాల ఉత్సవం సందర్భంగా 697 మంది పోలీసు బలగాలకు విధులు కేటాయించారు. జాతర ప్రాంగణం, భక్తుల రాకపోకలు, పార్కింగ్, ఇతర ట్రాఫిక్‌ను సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేయడానికి ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు. దొంగతనాలు, పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను కట్టడి కోస మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు విధులు కేటాయించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదివారం కురుమూర్తిస్వామి ఆలయం వద్ద ఎస్పీ డి.జానకి సూచనలు, సలహాలు ఇచ్చారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేయాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికంగా భక్తుల రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలన్నారు. ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలు పార్కింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఒక ఎస్పీ, ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 30 మంది సీఐలు, 61 మంది ఎస్ఐలు, 113 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 282 మంది కానిస్టేబుళ్లు, 82 మంది మహిళా కానిస్టేబుళ్లు, 123 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారని చెప్పారు. పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏఆర్ ఏఎస్పీ సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, బాలాజీ, సీఐ రామకృష్ణ, చిన్నచింతకుంట ఎస్ఐ గోకారి తదితరులు పాల్గొన్నారు.


