నేడు స్వామివారి పాదుకల ఊరేగింపు
నియమ నిష్ఠలతో..
● పల్లమర్రి నుంచి కురుమూర్తికి లక్షలాది జనం మధ్య తరలింపు
● ఏర్పాట్లు పూర్తిచేసిన
అధికార యంత్రాంగం
చిన్నచింతకుంట/ మదనాపురం: అమ్మాపురం కొండలపై కొలువైన కోనేటిరాయుడు, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన ఘట్టం సోమవారం నిర్వహించే ఉద్దాల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ అపూర్వ సంప్రదాయాన్ని కనులారా వీక్షించేందుకు ఉమ్మడి పాలమూరుతోపాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. స్వామివారి పవిత్ర పాదుకల ఊరేగింపుతో కురుమూర్తి క్షేత్రం భక్తజన సంద్రంగా మారనుంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పాలకమండలి, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉద్దాల ఉత్సవంలో భాగంగా పల్లమరి గ్రామం నుంచి చాటను ట్రాక్టర్‌పై ఊరేగింపుగా వడ్డేమాన్ గ్రామంలోని ఉద్దాల మండపానికి తీసుకొస్తారు. అక్కడ స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాటలో ఉంచుతారు. అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య అప్పంపల్లి ఊకచెట్టువాగు నుంచి వ్యవసాయ పొలాల మీదుగా తిర్మలాపూర్ గ్రామానికి.. అక్కడి నుంచి ట్రాక్టర్‌పై కురుమూర్తి గుట్టకు చేరుకుంటుంది. భక్తులు కిలోమీటర్ల మేర బారులుదీరి గంటల తరబడి వేచి ఉండి స్వామివారి పాదుకలను తాకి తన్మయత్వం పొందుతారు.
చిన్నవడ్డేమాన్ గ్రామానికి చెందిన సుమారు 60 దళిత కుటుంబాలు ఈ పవిత్ర సేవలో భాగమవుతాయి. కార్తీక అమావాస్య నుంచి ఏడురోజులపాటు మద్య, మాంసాలకు దూరంగా ఉంటూ, ఒంటిపూట భోజనం చేస్తూ నియమ నిష్ఠలతో పాదుకలను తయారు చేస్తారు. ఆవు చర్మం, వన్నెలాకు, పచ్చపూసలు, టేన్‌పోగులు, తగ్గి, వైనం, రేషం, పట్టు తదితర వస్తువులతో కురుమూర్తిస్వామి, పద్మావతి అమ్మవార్ల పాదుకలను రూపొందిస్తారు. ఈ సేవలో కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు. సప్తమి రోజున మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య పాదుకలను కురుమూర్తి గిరులకు ఊరేగింపుగా తీసుకువస్తారు.


