బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు
ఐదేళ్లుగా వచ్చిన ఆదాయం (రూపాయల్లో)
2,63,74,000
4,50,28,000
2,83,75,000
4,50,96,000
4,02,21,000
జడ్చర్ల: ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ప్రధాన వాణిజ్య కేంద్రంగా పేరొందిన బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధి క్రమంగా కుదించుకుపోతోంది. కొత్త మార్కెట్ యార్డుల ఏర్పాటు, పరిధుల పునర్వ్యవస్థీకరణతో ఒక్కొక్కటిగా మండలాలు దూరమవుతున్నాయి. తాజాగా భూత్పూర్ మండలాన్ని అడ్డాకుల మార్కెట్ పరిధిలోకి చేర్చడంతో బాదేపల్లి యార్డు జడ్చర్ల, మిడ్జిల్ మండలాలకే పరిమితమైంది. దీంతో మార్కెట్ ఆదాయంతో పాటు స్థానిక వ్యాపారాలపైనా ప్రభావం పడనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో బాదేపల్లి మార్కెట్ పరిధిలో జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, భూత్పూర్, తిమ్మాజీపేట మండలాల పరిధిలోని గ్రామాలు ఉండేవి. తొలుత తిమ్మాజీపేట మండలాన్ని తొలగించగా.. నాలుగేళ్ల క్రితం బాలానగర్‌లో కొత్తగా మార్కెట్ యార్డును ఏర్పాటు చేయడంతో ఆ మండలం కూడా దూరమైంది. తాజాగా ఈ ఏడాది అడ్డాకుల మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తూ జూన్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా భూత్పూర్ మండలాన్ని బాదేపల్లి నుంచి తొలగించి అడ్డాకుల పరిధిలోకి చేర్చింది. దీంతో ప్రస్తుతం బాదేపల్లి యార్డు పరిధిలో జడ్చర్ల మండలంలోని 31, మిడ్జిల్ మండలంలోని 16 గ్రామాలు మాత్రమే మిగిలాయి.
● ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన అడ్డాకుల వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో భూత్పూర్తో పాటు వనపర్తి రోడ్ మార్కెట్ పరిధిలో ఉన్న మూసాపేట మండలాన్ని కూడా చేర్చారు. దీంతో భూత్పూర్ మండలంలోని 16, అడ్డాకుల మండలంలోని 14, మూసాపేట మండలంలోని 14 గ్రామాలు కలిపి మొత్తం 44 గ్రామాలు అడ్డాకుల మార్కెట్ పరిధిలోకి వచ్చాయి.
ఆదాయానికి భారీగా గండి పడే అవకాశం..
బాదేపల్లి మార్కెట్‌కు గత ఐదేళ్లుగా లక్ష్యానికి మంచి ఆదాయం వచ్చేది. ఇందులో భూత్పూర్ మండలానికి కీలక వాటా ఉండేది. ఆ మండలంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వరికి సంబంధించిన మార్కెట్ రుసుముతో పాటు అక్కడి రైస్‌మిల్లులు, జిన్నింగ్ మిల్లుల్లో జరిగే క్రయవిక్రయాల ద్వారా కూడా యార్డుకు ఆదాయం సమకూరేది. తాజాగా భూత్పూర్ మండలం అడ్డాకుల పరిధిలోకి వెళ్లడంతో ఆ ఆదాయం ఇకపై అక్కడి మార్కెట్‌కు చేరనుంది. ఇప్పటికే బాలానగర్ మండలాన్ని కోల్పోయిన బాదేపల్లి యార్డుకు ఇది మరో ఎదురుదెబ్బగా మారనుంది.
వ్యాపారాలపైనా ప్రభావం..
బాదేపల్లి మార్కెట్‌కు చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. పంట విక్రయించిన తర్వాత కిరాణ ం, ఎరువులు, విత్తనాలు, వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు తదితరాలను ఇక్కడే కొనుగోలు చేసేవారు. రైతుల రాక తగ్గితే వారి లావాదేవీలపైనా ప్రభావం పడనుంది. ఇప్పటికే రెండు మండలాలను కోల్పోయిన మార్కెట్ తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధిస్తుందా? లేక మరింత పరిమితమైన యార్డుగా మిగిలిపోతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
2,57,79,000
నిర్వహణ భారమేనా?
గతంలో వివిధ మండలాల నుంచి భారీగా వ్యవసాయ ఉత్పత్తులు తరలివచ్చే నేపథ్యంలో బాదేపల్లి మార్కెట్లో కోట్లాది రూపాయలతో షెడ్లు నిర్మించారు. గంజ్‌లోని ప్రధాన మార్కెట్‌తో పాటు గంగాపూర్ రోడ్డులో పత్తి మార్కెట్ యార్డు కూడా కొనసాగుతోంది. ఈ రెండు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల నిర్వహణకు సిబ్బందిని నియమించారు. మార్కెట్ పరిధి తగ్గి ఆదాయం పడిపోతే ఈ మౌలిక సదుపాయాల నిర్వహణ కూడా భారంగా మారే అవకాశం ఉంది.
కుదించుకుపోతున్న వ్యవసాయ మార్కెట్ యార్డు
ఒక్కొక్కటిగా దూరమవుతున్న మండలాలు
ఇప్పటికే బాలానగర్ మార్కెట్ ఏర్పాటు.. తాజాగా అడ్డాకుల పరిధిలోకి భూత్పూర్
జడ్చర్ల, మిడ్జిల్ మండలాలకే పరిమితం
ఆదాయానికి గండి.. నిర్వహణ భారంపై ఆందోళన
స్థానిక వ్యాపారాలపైనా
పడనున్న ప్రభావం


