మత్తు రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మత్తు రహిత సమాజమే లక్ష్యం

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

నారాయణపేట: పొగాకు, ధూమపానం, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెనన్స్‌హాల్‌లో పొగాకు నియంత్రణ, మత్తు పదార్థాల నివారణపై జిల్లాస్థాయి కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్యార్థులు, యువత వ్యసనాల బారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పొగాకు, ధూమపానం, మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, గుట్కా, ఇతర మత్తు పదార్థాల వినియోగం వ్యక్తుల ఆరోగ్యానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలకు ఇవి కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్టళ్లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు చెడు వ్యసనాలతో కలిగే అనారోగ్య సమస్యలు, విద్యాభ్యాసం, భవిష్యత్‌పై పడే ప్రభావాలను వివరించాలన్నారు. విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా సంబంధిత శాఖలు నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని.. యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా క్రీడలు, విద్య, సామాజికసేవ వంటి సానుకూల కార్యక్రమాల వైపు మళ్లించాలని కోరారు. గ్రామాలు, పట్టణాలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో పోస్టర్లు, కరపత్రాలు, ర్యాలీలు, సమావేశాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. జిల్లాలో అక్టోబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 28 వరకు రెండు నెలల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్య, విద్య, పోలీస్‌, సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. పొగాకు, మత్తు పదార్థాల నియంత్రణ ఒక్కశాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కో–ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement