నారాయణపేట ఎడ్యుకేషన్: రైతులు ప్రకృతి వ్యవసాయం చేపడుతూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. శనివారం మండలంలోని అప్పిరెడ్డిపల్లి, సింగారంలో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఆత్మ) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయానికి అవసరమయ్యే ఎరువుల తయారీ, ఉపయోగాలపై క్షేత్ర పర్యటన నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. సింగారంలో రైతు ప్రతాప్‌రెడ్డి సాగు చేసిన పీఆర్‌జీ 176 కంది పంటను పరిశీలించారు. ప్రస్తుతం పంట పూత దశలో ఉన్నందున వేపనూనె పిచికారీ చేయాలని.. తద్వారా పూత, కాయకు హాని చేసే పురుగుల ఉధృతి తగ్గి మంచి దిగుబడి వస్తుందన్నారు. అదేవిధంగా అప్పిరెడ్డిపల్లిలో రైతు సుభాష్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జీవామృతం, ఘన జీవామృతం తయారీ విధానం, ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో భూమి ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండి పంట నష్టం లేకుండా దిగుబడి వస్తుందని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపుకు మారాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దినకర్, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజేష్, అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


