నారాయణపేట ఎడ్యుకేషన్: చిన్నారులకు ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం రోజు నాణ్యమైన సమతుల పోషకాహారం తప్పనిసరిగా అందించాలని జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్‌గౌడ్ సూచించారు. గురువారం మండలంలోని జాజాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, గర్భిణలు, బాలింతలకు అందుతున్న సంక్షేమ సేవలు, పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోషకాహార పంపిణీలో నిర్లక్ష్యానికి తావులేదని.. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అనంతరం అందుబాటులో ఉన్న పోషకాహార, సరుకుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, సంపూర్ణ ఎదుగుదల, పోషకాహార లోపాల నివారణలో అంగన్‌వాడీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.


