గడువు రెండ్రోజులే..! | - | Sakshi
Sakshi News home page

గడువు రెండ్రోజులే..!

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

నారాయణపేట: జిల్లాలో 2022–23 యాసంగి సీజనన్‌కు సంబంధించిన వరి ధాన్యం వేలం బకాయిలను 31వ తేదీలోగా పూర్తిగా చెల్లించాలని రైస్‌మిల్లర్లకు ప్రభుత్వం విధించిన గడువు సమీపిస్తోంది. మరో రెండ్రోజుల్లో గడువు ముగియనుండటంతో జిల్లాలోని 15 రైస్‌మిల్లులపై ఉన్న రూ.61.87 కోట్ల బకాయిల వసూళ్లపై ఉత్కంఠ నెలకొంది. గడువులోగా చెల్లింపులు జరగకపోతే నిబంధనల ప్రకారం జరిమానా, వడ్డీ విధించడంతో పాటు రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆస్తుల జప్తు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. నవంబర్‌ 1 నుంచి తదుపరి చర్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

● సీఎంఆర్‌ అప్పగించని, బకాయిలు చెల్లించని డిఫాల్ట్‌ రైస్‌మిల్లర్లపై చర్యలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ సిద్ధమైంది. ధాన్యం బకాయిల వసూళ్లతో పాటు నిల్వల వ్యత్యాసాలు, ధాన్యం దారి మళ్లింపు వంటి ఆరోపణలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించింది. రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) చట్టం ప్రకారం ఆస్తుల జప్తు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఆకస్మిక తనిఖీల్లో రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యం కంటే తక్కువ నిల్వలు ఉన్నట్లు గుర్తించిన మిల్లర్లకు ఇదివరకే షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన బియ్యాన్ని తక్షణమే అప్పగించాలని, లేనిపక్షంలో ఆస్తులను కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికార యంత్రాంగం డిఫాల్ట్‌ మిల్లర్లతో బకాయిల వసూలుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31 వరకు బకాయిలు చెల్లించని మిల్లర్ల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.

సకాలంలో చెల్లించాలి..

ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా బకాయిలు చెల్లించని మిల్లర్లను పూర్తిగా డిఫాల్టర్లుగా ప్రకటిస్తారు. వారిపై రెవెన్యూ రికవరీ చట్టం, అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి వారి స్థిర, చర ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది.

– సైదులు, డీఎం, జిల్లా పౌరసరఫరాలశాఖ

ధాన్యం వేలం బకాయిలపై ఉక్కుపాదం

జిల్లాలో 15 రైసు మిల్లులు.. రూ.61.87 కోట్ల రికవరీ

డిఫాల్ట్‌ మిల్లర్ల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం సిద్ధం

25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీతో వసూలు

పౌరసరఫరాలశాఖ కఠిన వైఖరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement