జాప్యమే శాపమైంది! | - | Sakshi
Sakshi News home page

జాప్యమే శాపమైంది!

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

నాలుగు రిజర్వాయర్లలో..

కుడికిళ్ల, తీర్నాంపల్లి గ్రామాల మధ్య కొనసాగుతున్న పనులు ఇప్పటికే పూర్తయి ఉంటే నార్లాపూర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి లిఫ్టింగ్‌ ద్వారా వట్టెం రిజర్వాయర్‌కు, అటు నుంచి గ్రావిటీ ద్వారా కర్వెన రిజర్వాయర్‌ వరకు నీటిని తరలించే వెసులుబాటు ఉండేది. ఈ నాలుగు రిజర్వాయర్లలో 49.50 టీఎంసీల మేరకు నీటిని నిల్వ చేసుకోవచ్చు. అంటే ప్యాకేజీ–3 పనుల్లో జరిగిన జాప్యం కారణంగా 43 టీఎంసీల మేరకు నీటిని ఈ ఏడాది పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ప్రజలు నష్టపోయారన్నమాట. ఇప్పుడు వినియోగంలోకి తీసుకొచ్చిన 2 మోటార్లను రెండు నెలల క్రితమే ప్రారంభించి ఉంటే రోజుకు 0.50 టీఎంసీ చొప్పున కనీసం 30 టీఎంసీల నీటినైనా ఎత్తిపోసుకునే అవకాశం ఉండేదని నిపుణులు వివరిస్తున్నారు.

కొల్లాపూర్‌: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముందుచూపుతో వ్యవహరించకపోవడం.. నిధుల లేమి, గుత్తేదారుల ఇష్టారాజ్యం వంటి కారణాలతో శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. ఎల్‌నినో ప్రభావంతో నదుల్లో నీటినిల్వలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. నదిలో ఉన్న నీటిని ఒకవైపు ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు అక్కడి ప్రభుత్వం నిరాంటకంగా తరలిస్తుండగా.. తెలంగాణలో మాత్రం చిన్నచిన్న కారణాలతో నీటిని ఎత్తిపోసుకోలేని పరిస్థితి దాపురించింది.

మూడేళ్ల క్రితమే ప్రారంభం..

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును 2023 సెప్టెంబర్‌ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఎల్లూరు సమీపంలోని పంప్‌హౌజ్‌లో ఒక మోటారు ఆన్‌చేసి.. నీటి ఎత్తిపోతలు చేపట్టారు. అప్పట్లో 2 టీఎంసీల నీటిని నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో నింపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో మోటారును లాంఛనంగా ప్రారంభించారు. డ్రై రన్‌ నిర్వహించి, కొంతమేరకు నీటిని ఎత్తిపోశారు. అయితే నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయకపోవడం.. ప్రాజెక్టు అవసరాలకు సరిపడా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ లేకపోవడంతో నీటి ఎత్తిపోతలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆ సమస్యలు పరిష్కారం కావడంతో ఈ నెల 14న రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. 5 రోజులపాటు పంపింగ్‌ కొనసాగింది. ప్రస్తుతం నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో 6.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

నిధులు కేటాయించినా..

నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌ వరకు 21.816 కి.మీ. పొడవునా కాల్వలు తవ్వుతున్నారు. అందులో 5.92 కి.మీ. ఓపెన్‌ కెనాల్‌ కాగా.. 15.89 కి.మీ., టన్నెల్‌ ద్వారా నీటిని తరలించేందుకు పనులు చేపట్టారు. టన్నెల్‌ పనులు దాదాపుగా తుదిదశకు చేరాయి. తీర్నాంపల్లి సమీపంలో ఓపెన్‌ కెనాల్‌కు అనుసంధానంగా 50 మీటర్ల మట్టి తవ్వకం మాత్రమే పెండింగ్‌లో ఉంది. 400 మీటర్ల మేరకు లైనింగ్‌ చేయాల్సి ఉంది. అయితే ఓపెన్‌ కెనాల్‌ ప్యాకేజీ–3 కింద చేపట్టగా.. ఈ పనులను ఏపీకి చెందిన ఓ కంపెనీ దక్కించుకుంది. బీఆర్‌ఎస్‌ హయాంలో కాల్వ తవ్వకాలను 50 శాతానికి పైగా పూర్తిచేసింది. అయితే తవ్వకాల్లో ఎక్కువ శాతం రాళ్లు వస్తున్నాయని.. తమకు కేటాయించిన నిధులు సరిపోవడం లేదని, భూ సేకరణ సమస్యల పేరుతో పనులను సదరు కాంట్రాక్టు కంపెనీ మధ్యలోనే నిలిపివేసింది. కుడికిళ్ల శివారు నుంచి తీర్నాంపల్లి సమీపంలోని టన్నెల్‌ వరకు దాదాపుగా 3 కి.మీ., మేరకు పనులను అసంపూర్తిగా వదిలేసింది. దీంతో ఏడాది క్రితం అసంపూర్తిగా ఉన్న కాల్వను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించి.. పనుల పూర్తికి రూ.100 కోట్లకు పైగా అదనపు నిధులు కేటాయించారు. అయినప్పటికీ పనులు నత్తనడకనే కొనసాగాయి. సదరు కంపెనీ ఉద్దేశపూర్వకంగానే పనులను నిదానంగా కొనసాగిస్తోందని.. ఏపీ ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చే దురాలోచన ఇందులో ఉందని నీటిపారుదల రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

‘పాలమూరు’ ప్రధాన కాల్వ అసంపూర్తితో నీటిని ఎత్తిపోసుకోలేని దుస్థితి

ప్యాకేజీ–3 పనుల్లోతీవ్ర జాప్యమే ప్రధాన కారణం

మరోవైపు నిధుల లేమి, గుత్తేదారుల ఇష్టారాజ్యం

కెనాల్‌ పూర్తయ్యింటే 40 టీఎంసీలకు పైగా నీటి నిల్వకు అవకాశం

ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వానికి కొరవడిన ముందుచూపు

ముందుకు పారించలేని దుస్థితి..

ప్రభుత్వం ఆలస్యంగా స్పందించి పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు చేపట్టినప్పటికీ ఆ నీటిని ముందుకు పారించలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం ఆ నీటిని మిషన్‌ భగీరథ అవసరాల కోసం మాత్రమే వినియోగించనున్నారు. ఇది కూడా రోజుకు 0.2 టీఎంసీ మాత్రమే. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రధాన కాల్వ పనులను పూర్తిచేయకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది.

డిసెంబర్‌లోగా పూర్తిచేస్తాం..

ప్యాకేజీ–3 పనులు తీర్నాంపల్లి సమీపంలో కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా పను ల్లో వేగం పెంచాం. ఇంకా 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకాలు జరపాలి. డిసెంబర్‌ నెలాఖరు నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కాల్వ తవ్వకాలు పూర్తయితే టన్నెల్‌ ప్రారంభంలో ఉన్న మట్టిని తొలగించి, నార్లాపూర్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

– అమర్‌సింగ్‌,ఈఈ, నీటిపారుదలశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement