నిరంతర పర్యవేక్షణలోనే..
గణేష్ ఉత్సవాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మండపాల జియో ట్యాగింగ్‌తో పాటు కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎస్పీ కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. డీజేల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు 120 మందిని బైండోవర్ చేశాం. మండపాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి నిబంధనలు, ట్రాఫిక్, విద్యుత్ భద్రత, నిమజ్జన మార్గాలపై అవగాహన కల్పిస్తున్నాం. మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు నిరంతరం పోలీస్ పర్యవేక్షణ ఉండేలా కార్యాచరణ రూపొందించాం.
– డా. వినీత్, ఎస్పీ
నారాయణపేట: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి వేడుకలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు ఎస్పీ డా. వినీత్ దిశానిర్దేశంలో జిల్లా పోలీసుశాఖ పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టింది. మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు అడుగడుగునా పోలీసుల నిఘా ఉండేలా ప్రత్యేక భద్రత వ్యవస్థను అమలులోకి తెచ్చింది. జిల్లాలోని 1,723 వినాయక మండపాలకు జియో ట్యాగింగ్ చేసి వాటి పూర్తి వివరాలను నమోదు చేశారు. కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 2,002 సీసీ కెమెరాలను ఎస్పీ కార్యాలయానికి అనుసంధానం చేసి అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మండపాల వద్ద పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. మండపాల నిర్వాహకులతో ముందస్తు సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతలు, ట్రాఫిక్, విద్యుత్ భద్రత, నిమజ్జన మార్గాలు, పోలీస్‌శాఖ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు రాత్రివేళల్లో గస్తీని ముమ్మరం చేస్తున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ అధికారులు, సిబ్బందిని కేటాయించారు.
సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి..
గణేష్ ఉత్సవాల్లో డీజేల వినియోగానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 120 మందిని ముందుగానే గుర్తించి బైండోవర్ చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
పోలీస్‌స్టేషన్ విగ్రహాలు సీసీ సీసీ
టీవీలు కెమెరాలు
మక్తల్ 215 39 295
మద్దూర్ 191 25 106
కోస్గి 186 48 126
నా,పేట టౌన్ 153 58 874
దామరగిద్ద 151 16 29
నా,పేట రూరల్ 149 60 91
ఊట్కూర్ 148 35 56
మరికల్ 138 56 237
నర్వ 124 23 26
ధన్వాడ 119 37 43
మాగనూర్ 77 23 48
కృష్ణా 72 23 71
పోలీస్‌స్టేషన్ల వారీగా ఇలా..
జిల్లాలో 1,723 వినాయక మండపాలకు జియో ట్యాగింగ్
443 ప్రాంతాలు.. 2,002 సీసీ కెమెరాలు
మండపం నుంచి నిమజ్జనం దాకా పకడ్బందీ భద్రత
డీజేలకు అనుమతి నిరాకరణ.. 120 మంది ముందస్తు బైండోవర్
ఎస్పీ కార్యాలయం నుంచి ప్రత్యేక పర్యవేక్షణ


