‘కురుమూర్తి’ ఘాట్‌ రోడ్‌ పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

‘కురుమూర్తి’ ఘాట్‌ రోడ్‌ పూర్తిచేస్తాం

Sep 21 2026 6:53 AM | Updated on Sep 21 2026 6:53 AM

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రికోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

దేవరకద్ర/చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆలయం వద్ద చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ ఘాట్‌ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకద్ర మండలం మినుగోనిపల్లి వద్ద నియోజకవర్గంలో రూ.153 కోట్లతో చేపడుతున్న పలు రహదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖమంత్రి వాకిటి శ్రీహరి, మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎస్పీ జానకితో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం కురుమూర్తిస్వామి ఆలయం వద్ద కొనసాగుతున్న ఘాట్‌ రోడ్డు నిర్మాణం పనుల రోడ్డు మ్యాపును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్‌, కర్వెన రిజర్వాయర్‌ పనులను పూర్తిచేసి త్వరలోనే కృష్ణానీటితో నింపుతామన్నారు. ఉదండాపూర్‌ భూ సేకరణకు ప్రభుత్వం రూ.560 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రాజెక్టులు నిండలేదని, నదులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయని పేర్కొన్నారు. తాగునీటి అవసరాలకుగాను ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని నిల్వ చేస్తున్నామని, ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బ్రహ్మోస్‌ కోసం సేకరిస్తున్న భూములకు తగిన నష్టపరిహారం ఇవ్వడంతోపాటు రైతులకు న్యాయం చేస్తామన్నారు.

పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్పీ

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు, తాఖీబాబా దర్గా ఉర్సు ప్రశాంతంగా సోదరభావంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించేందుకు పోలీస్‌శాఖ పటిష్ట భద్రత చర్యలు చేపడుతోందని ఎస్పీ డా. వినీత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కులాలు, మతాలు, వర్గాలను కించపర్చేలా, అవమానించేలా, రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, కామెంట్లు, వీడియోలు, మార్ఫింగ్‌ చేసిన చిత్రాలను ప్రచారం చేయడం, ఫార్వడ్‌ చేయడం చట్టారీత్యా నేరమని పేర్కొన్నారు. పోలీస్‌ అధికారులు నిరంతరం సోషల్‌ మీడియాను పర్యవేక్షిస్తున్నారని.. అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement