నారాయణపేట: జిల్లాలోని ధన్వాడలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలలో శనివారం ఉదయం అల్పాహారం తిన్న పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 88 మంది విద్యార్థునులు ఉండగా 29 మందికి కడుపునొప్పి రావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో 16 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
● శనివారం ఉదయం విద్యార్థినుల కోసం బొండా, పల్లి చట్నీ అల్పాహారంగా తయారు చేశారు. అల్పాహారం తీసుకున్న తర్వాత కొందరు విద్యార్థినులకు కడుపునొప్పి రాగా.. అంతగా పట్టించుకోలేదు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం శ్వాస ఇబ్బందులు, కడుపునొప్పి తీవ్ర కావడంతో హాస్టల్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే 29 మంది విద్యార్థులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో విద్యార్థినులు నిర్మల, నవ్యశ్రీ, అర్చన, శ్రీవిద్య, రుత్విక, ప్రవళిక, లావణ్య, విద్య, అనిత, టి.లావణ్య, జ్యోతి, నందిని, హరిత, లక్ష్మి, బిందుశ్రీ మొత్తం 16 మంది విద్యార్థినులను మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మిగిలిన 13 మంది విద్యార్థినులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
చట్నీపై విద్యార్థినుల వాదన..
వేరుశనగకు పురుగులు పట్టడంతో వాటిని ఎండలో వేసి అనంతరం చట్నీ తయారు చేసినట్లు కొందరు విద్యార్థినులు చెబుతున్నారు. పుచ్చుబట్టి పచ్చగా మారినట్లు కనిపించినప్పటికీ వాటిని తొలగించకుండా చట్నీ తయారు చేసి వడ్డించారని వారు ఆరోపించారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి ఆహార నమూనాల పరీక్షల ద్వారా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. విద్యార్థినుల వాంగ్మూలాలను అధికారులు నమోదు చేసి ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది.
కలెక్టర్ తక్షణ చర్యలు..
విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై కలెక్టర్ ప్రియాంక తక్షణమే స్పందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించి సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ రమేష్, తహసీల్దార్ సింధూజ, మండల ప్రత్యేక అధికారి సాల్మన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ ప్రియాంక తెలిపారు.
హాస్టల్‌లో సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్న ఆర్డీఓ రమేష్
కుటుంబసభ్యుల్లో ఆందోళన..
విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థినులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందడంతో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలుపడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వైరల్ ఎంటెరిటిస్‌గా గుర్తింపు..
అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా జనరల్ ఆస్పత్రి బృందం సంపత్‌కుమార్‌సింగ్, డా. బాలాజీ, సర్జనన్ ఆదిత్యగౌడ్ వివరాలు వెల్లడించారు. వైరల్ ఎంటెరిటిస్‌గా గుర్తించామని.. ప్రస్తుతం అవసరమైన చికిత్స కొనసాగుతోందన్నారు. కొందరు విద్యార్థులు కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని, ఒకరోజు వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన అ నంతరం పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యబృందం పేర్కొంది.
ధన్వాడ మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఘటన
బుజుపట్టిన వేరుశనగతో చట్నీ తయారీ
29 మంది విద్యార్థినులకుకడుపునొప్పి
16 మంది జిల్లా ఆస్పత్రికి తరలింపు
స్పందించిన కలెక్టర్.. కేర్‌టేకర్, వంటమనిషి తొలగింపు


