నారాయణపేట: రాజీమార్గంలో కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఎంతో సమర్థవంతమైన వేదికని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కో–ఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 12న నిర్వహించనున్న నాలుగో జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కక్షిదారులు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 12న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లాలో 5,552 కేసులు పరిష్కరించగా.. రాష్ట్రవ్యాప్తంగా 23వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. డిసెంబర్ 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల పరిష్కార ప్రక్రియను కూడా యథావిధిగా కొనసాగించాలని సూచించారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్, సఖి కేంద్రాల సిబ్బందితో న్యాయమూర్తి సమీక్ష నిర్వహించారు. పోక్సో కేసుల్లో తప్పనిసరి నివేదికలు, బాధితుల గుర్తింపు రక్షణ, ఫాస్ట్ ట్రయల్స్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్, డీఎస్పీ లింగయ్య, ఆర్డీఓ రమేష్, డీపీఆర్వో ఎంఏ రషీద్, డీసీపీఓ కరిష్మా, సఖి సెంటర్ కో–ఆర్డినేటర్ క్రాంతిరేఖ, ఉమెన్ అండ్ చైల్డ్‌వెల్ఫేర్‌శాఖ అనిత, పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
లోకాయుక్తకు ఫిర్యాదు
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని చేనేత సొసైటీల్లో రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని.. తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హైందవిరెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు కెంచె నారాయణ, వివిధ సంఘాల నాయకులు శనివారం హైదరాబాద్‌లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుమారు 5 వేల మంది చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జౌళిశాఖ అధికారులపై అక్రమ లావాదేవీలకు సంబంధించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ కలెక్టర్, జౌళిశాఖ అధికారుల నుంచి కనీస స్పందన లేదని పేర్కొన్నారు. అక్రమాలకు బాధ్యులుగా ఉన్న సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులపై చర్యలు తీసుకోవడంతో పాటు నిధులను రికవరీ చేసి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని లోకాయుక్తను కోరినట్లు నాయకులు తెలిపారు.


