భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యం

Sep 20 2026 1:21 AM | Updated on Sep 20 2026 1:21 AM

నారాయణపేట: గణేష్‌ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్‌ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువు వద్ద నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు నిమజ్జన ఏర్పాట్ల వివరాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెరువులో ప్రస్తుతం నీటిమట్టం తక్కువగా ఉన్నందున భక్తులు నీటిలోకి వెళ్లకుండా చెరువు అంచు వరకు బారికేడింగ్‌, రక్షణ కంచె నిర్మించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా గజ ఈతగాళ్లు, క్రేన్లు, బోట్లు/పుట్టీలు, ఇతర రక్షణ పరికరాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. చెరువులోకి ఎవరూ వెళ్లకుండా పోలీసు సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లోనూ నిమజ్జనం జరిగే అవకాశం ఉన్నందున చెరువు పరిసరాల్లో తగినంత వెలుతురు ఉండేలా లైటింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువులో నీటిమట్టం తక్కువగా ఉన్నందున 15 అడుగులకు పైగా ఉన్న విగ్రహాలను కృష్ణానది లేదా అధికారులు గుర్తించిన ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌, ఎస్పీ సూచించారు. నిమజ్జన ప్రాంతంలో భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తి చేయాలని కలెక్టర్‌, ఎస్పీ కోరారు. కలెక్టర్‌, ఎస్పీ వెంట ఆర్డీఓ రమేశ్‌, డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్‌, పుర కమిషనర్‌ శంకర్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement