ఎమ్మెల్యే స్వగ్రామంలోనే..
ఎమ్మెల్యే డా. పర్ణికారెడ్డి స్వగ్రామంలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులు అల్పహారం తిని అస్వస్థతకు గురికావడం చాలా బాధాకారం. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతగా ఉండేలా చూడాలి. లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతాం.
– ఏబీవీపీ నాయకులు
ముందు నాకే కడుపునొప్పి..
హాస్టల్‌లో ఉదయం బొండా, చట్నీ తిన్న తర్వాత ముందుగా నాకే కడుపునొప్పి వచ్చింది. తొలుత పెద్దగా పట్టించుకోలేదు.. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరింత ఎక్కువైంది. నాతో పాటు మరికొందరికి కడుపునొప్పి రావడంతో పరిస్థితిని గమనించి వెంటనే సిబ్బందికి చెప్పాం. వెంటనే ప్రత్యేక వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
– విద్యారాణి, విద్యార్థిని
●
ఇదే మొదటిసారి..
హాస్టల్‌లో ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. – లావణ్య, విద్యార్థిని
ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యతగా లేకపోవడంతోనే అస్వస్థతకు గురవుతున్నారు. జరగరానిది జరిగి పిల్లల ప్రాణాలు పోతే ఎవరు తెచ్చిస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే డా. పర్ణికారెడ్డి బాధ్యత వహించాలి. – రాఘవేంద్ర, ధన్వాడ
కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశాల మేరకు ధన్వాడ తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ కేర్‌టేకర్ అనురాధ, వంట మనిషి కావేరిని విధుల నుంచి తొలగించినట్లు జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి గాయత్రి, జీఈసీఓ సంగీత ఆహారాన్ని పరిశీలించి నాణ్యత లేని వేరుశనగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. బూజుపట్టిన వేరుశనగలతో తయారు చేసిన చట్నీ తినడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు విచారణ అధికారులు తెలిపారు.


