కోస్గి: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో తెలంగాణ రక్షణ సేనా చీఫ్ కల్వకుంట్ల కవిత శంఖారావం పూరించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహంచే పాంచజన్య సంకల్ప సభకు పార్టీ నాయకులు భారీఎత్తున ఏర్పాట్లు చేపడుతున్నారు. సభా వేధికపై వంద మంది నాయకులు కూర్చునేలా, సభకు 10 వేల మంది జనం హాజరయ్యేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రక్షణసేనా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదట కొడంగల్‌కు వస్తున్న పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొడంగల్ నుంచి కోస్గి వరకు భారీ ర్యాలీ.. పట్టణంలోని శివాజీ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించి నేరుగా సభా వేధికకు చేరుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కవిత కోస్గి సభ వేధిక నుంచి సమర శంఖం పూరించనున్నారు. పార్టీ ఏర్పాటు అనంతరం జోగుళాంబ తల్లి ఆశీస్సులతో పాలమూరు గడ్డపై మొదటిసారిగా అడుగుపెట్టిన కవిత రెండోసారి కొడంగల్ నియోజకవర్గంలో అత్యంత కీలక సంకల్పం తీసుకుంది. ఈ వేధిక నుంచి సబ్బండవర్గాలు, సకల జనుల అభివృద్ధి, సాధికారితతో కూడిన బహుజన తెలంగాణ సాధనకు తాను తీసుకోబోయే నిర్ణయాలను ప్రకటించనుంది. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిరక్షించుకునేందుకు స్వీయ రాజకీయ శక్తి ఎందుకు అవసరమో కవిత వివరించనున్నారు. రెండు జాతీయ పార్టీలు ఢిల్లీకి గులాంగిరి చేస్తూ తెలంగాణ ప్రయోజనాలను ఎలా పణంగా పెడుతున్నారో వివరిస్తారు.


