నారాయణపేట: జిల్లాలో సీతాఫలాల దిగుబడిని పరిశీలించి రైతులకు ప్రయోజనం కలిగేలా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సెర్ప్ పీఎం ఉమాపతి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నారాయణపేటలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో మద్దూరు, దామరగిద్ద, నారాయణపేట మండలాల సెర్ప్ ఐకేపీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు మండలాల్లో సీతాఫలాల దిగుబడిపై ముందుగా సర్వే నిర్వహించాలని.. దిగుబడి, రైతుల అవసరాలను అంచనా వేసిన అనంతరం రెండు, మూడు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రాసెసింగ్ ద్వారా సీతాఫలాలకు విలువ జోడించి రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం దామరగిద్ద ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న సీతాఫల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు. యూనిట్‌లోని మిషనరీ పనితీరును పరిశీలించి మరమ్మతు, సాంకేతికత గురించి టెక్నీషియన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ రవీందర్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మారుతి, డీపీఎం జయన్న, ఏపీఎంలు నారాయణ, అంజయ్య, కృష్ణవేణి, లక్ష్మి, మూడు మండలాల సీసీలు, వీఓఏలు, నారాయణపేట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ నాగమణి, వైస్ చైర్మనన్ సుజాత, రైతులు పాల్గొన్నారు.


