నారాయణపేట/మక్తల్/ఊట్కూరు: వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. చెరువుల్లో నీటిమట్టాలు తక్కువగా ఉండటంతో పెద్ద విగ్రహాల నిమజ్జనానికి కృష్ణానది, చెరువుల్లో లోతైన ప్రాంతాలను గుర్తించే అంశంపై అధికారులు దృష్టి సారించారు. శుక్రవారం అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్‌హక్, ఆర్డీఓ రమేష్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సంబంధిత పోలీస్ అధికారులు, పుర, రెవెన్యూ, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు కలిసి మండలంలోని కొండారెడ్డిపల్లి చెరువు, ఉట్కూరు పెద్ద చెరువు, మక్తల్ దండు మూల చెరువు, కృష్ణా మండలంలోని కృష్ణానదిని పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో లోతు, నీటి పరిస్థితి, భద్రత, లైటింగ్, పారిశుద్ధ్యం, క్రేన్ల ఏర్పాటు, బారికేడింగ్, వాహనాల రాకపోకలు, పార్కింగ్, భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను అధికారులు పరిశీలించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, నిర్వాహకులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రివేళ కూడా నిమజ్జన కార్యక్రమానికి ఇబ్బందులు లేకుండా లైటింగ్ సౌకర్యాలు కల్పించాలని, చెరువు పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రియాజ్ ఉల్‌హక్ మాట్లాడుతూ.. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు నిమజ్జన ప్రాంతాల్లో నీటిమట్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి కృష్ణానది లేదా చెరువుల్లో లోతైన ప్రాంతాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేసే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీస్‌శాఖకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


