800 రోజులు.. కాంగ్రెస్‌కు నిద్రలేని రోజులే.. | - | Sakshi
Sakshi News home page

800 రోజులు.. కాంగ్రెస్‌కు నిద్రలేని రోజులే..

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

నారాయణపేట: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తైనా 6 గ్యారెంటీలు, 420 హా మీల అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడ రాజేందర్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ 420 హామీలు అమలు చేయలేదని గుర్తు చేస్తూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ప్రదర్శించారు. అనంతరం ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే 800 రోజులు కాంగ్రెస్‌ నాయకులకు నిద్రలేని రోజులే అని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పంపిణీ చేసిన గ్యారెంటీ కార్డులు ఇప్పుడు ‘బాకీ కార్డులుశ్రీగా మారిపోయాయని ఎద్దేవా చేశారు.

అన్ని వర్గాలకు అన్యాయమే..

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు వంటి హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా బకాయి మొత్తాన్ని ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.

‘రెండు కళ్ల’పై ఘాటు వ్యాఖ్యలు

నారాయణపేట, కొడంగల్‌ తనకు రెండు కళ్లంటూ ముఖ్యమంత్రి చెబుతున్నా.. ఒక కంటికి సు న్నం, మరో కంటికి బెల్లం పెడుతున్నారని మండిపడ్డారు. తన హయాంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాల్లో చెడిపోయిన బల్బులను సైతం మార్చ లేని పరిస్థితి రావడం బాధాకరమన్నారు. రోడ్ల మధ్య నాటిన మొక్కలకు నీరు పోయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో కార్యక్రమ ఇన్‌చార్జీ రాజీవ్‌సాగర్‌, నాయకులు అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, వేపూరి రాములు, విజయ్‌సాగర్‌, సుదర్శన్‌రెడ్డి, నర్సప్ప, కన్నా జగదీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement