వనపర్తిటౌన్: క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన వంటి ఉన్నత విలువలను నేర్పుతాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆరేపల్లి వెంకటేశ్వర్లు స్మారక 72వ స్టేట్ సీనియర్ మెన్, ఉమెన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల్ బ్యాడ్మింటన్ శారీరక దృఢత్వంతో పాటు మానసిక చురుకుదనాన్ని పెంపొందించే క్రీడన్నారు. క్రీడాకారులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని నిరంతరం సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని సూచించారు. ఒలింపిక్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పాల్గొని పతకాలు సాధించి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో మహిళల భాగ్యస్వామ్యం పెరుగుతుండటం ఆనందకర విషయమని, తమ ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జీవితంలో గెలుపు, ఓటమి సహజమని, సమానంగా స్వీకరించే ఓర్పు, క్రమశిక్షణ క్రీడలతోనే అలవడుతాయని పేర్కొన్నారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు శ్రీనివాస్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, రామ్మోహన్‌రావు, కోచ్‌లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి బాబా, ద్వారపోగు విజయ్‌బాబు పాల్గొన్నారు.


