మక్తల్/ కృష్ణా: కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న జలదోపిడిని అరికట్టకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్‌ఎస్ బృందంతో కలిసి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా వారు కృష్ణానదిపై ఉన్న గూగల్ ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో దిగువకు వచ్చే నీరు తగ్గిపోతుందని, ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురుస్తున్నందున తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే చర్యలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే జూరాలలో పూడిక పేరుకుపోవడంతో 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ప్రాజెక్టు నిర్మిస్తే.. కేవలం 6 నుంచి 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నామన్నారు. ఈ విషయం గ్రహించే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి, ఎక్కడికక్కడ నీటిని నిల్వలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం నర్సిరెడ్డి ఉన్న సమయంలో నియోజకవర్గంలో కృష్ణా, భీమానదులపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారని, ప్రస్తుతం నదిలో నీళ్లులేక అవి మూతపడ్డాయన్నారు.
మాజీమంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్


