● అదనపు కలెక్టర్ ఫణీందర్‌రెడ్డి
నారాయణపేట: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు కొనసాగనుందని.. ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీందర్‌రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయిదు దశల్లో 99 రోజుల ప్రణాళికను అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి తప్పిదాలు లేకుండా శాఖల వారీగా రూపొందించాలన్నారు. ఏప్రిల్ 2న గ్రామసభలు, ఏప్రిల్ 16న మండలస్థాయిలో, మే 2న నియోజకవర్గస్థాయిలో, మే 22న జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు అన్ని గ్రామపంచాయతీలు, పురపాలికల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మార్చి 16 నుంచి 31 వరకు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలని, జూన్ 2 వరకు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు కార్యాలయాలు, పాఠశాలల్లో సోలార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రవాణాశాఖ ఆధ్వర్యంలో అరైవ్.. అలైవ్ కార్యక్రమాలు ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సంక్షేమశాఖ ఏప్రిల్ 20 నుంచి 24 వరకు వారి కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యవసాయశాఖ మే నెల నాలుగు నుంచి 9 వరకు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రీ, ఇతర పనులు చూడాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను పాల్గొన్నారు.


