సాంఘికశాస్త్రం.. అవగాహన, విశ్లేషణ కీలకం
సాంఘికశాస్త్రంలో విద్యార్థులు ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ చదవాలి. కీలక పదాలు రాసి ఉంచుకొని, గుర్తుంచుకొని ప్రశ్నలకు అనుగుణంగా సమాధానాలు రాయాలి. తప్పులు లేకుండా అందంగా రాయగలిగితే మంచి మార్కులు సాధించవచ్చు.
అన్ని అంశాలపై..
పుస్తకంలోని అన్ని పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకొని భావనల వారీగా ప్రాధాన్యం, అక్షరాలు, భేదాలు, పోలికలు, ఉదాహరణలు తెలుసుకోవాలి. హిమాలయాల ప్రాధాన్యం, తూర్పు పశ్చిమ కనుమల బేధాలు, వాతావరణంలో వచ్చే మార్పులు, జనాభా పెరుగుదలకు కారణాలు, వలసల వర్గీకరణ, ఉత్పత్తి కారకాలు, ప్రపంచీకరణ ప్రభావం, ఆహార భద్రత.. ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ యుద్ధాల కారణాలు, ఆర్థిక మాంధ్యం ప్రభావం విషయాలపై దృష్టి సారించాలి.
వెనుకబడిన వారు చేయాల్సినవి..
కనీస సామర్థ్యాల్లో వెనుకబడిన వారు కొంత దృష్టి సారించి చదివితే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. పాఠాలు, గ్రాఫ్‌లు, పట్టికలు, పటాల వంటి అంశాల్లో సాధన చేయాలి. అభ్యాస దీపిక చదివితే మార్కులు పెరిగే అవకాశం ఉంది. గ్రాఫ్, పట్టికలు క్షుణ్ణంగా సాధన చేస్తే 10 మార్కులు, పేరాగ్రాఫ్‌లు బాగారాస్తే 12 మార్కులు, పటం సులువుగా గుర్తించగలిగితే ఐదు మార్కులు పొందేందుకు అవకాశం ఉంది.
పేరాగ్రాఫ్ విశ్లేషణ చేస్తున్నప్పుడు పేరాలోని అంశాన్ని మరింత వివరించాలి. పట్టిక, గ్రాఫ్ విశ్లేషణ సమయంలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా లోతుగా వివరించాలి. ప్రముఖుల లక్షణాలు, ఆశయాలు, నినాదాలు గుర్తించుకోవాలి. భారతదేశం, తెలంగాణ అవుట్ లైన్ మ్యాప్ గీయగలగాలి. ప్రపంచ పటంలో దేశాలు, సముద్రాలు, తెలంగాణలో పర్వతాలు, నదులు, పట్టణాలు, ఎడారులు తదితర వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. పర్యావరణం, నీటి సంరక్షణపై అవగాహన ఉండాలి. కరపత్రం తయారీలో శీర్షిక, విషయం, వివరణ, సలహాలు, సూచనలు, ముద్రించిన వారి వివరాలు, రద్దుల సంఖ్య, అవసరమైన పటాన్ని గీయాలి. విషయ అవగాహన ప్రశ్నలకు కీలక పదాలు వాడాలి. సమకాలిన సమస్యలకు కారణాలు, ఫలితాలు, పరిష్కారం చూపేలా సిద్ధమవ్వాలి. – నర్సింహ,
సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు,
జెడ్పీ ఉన్నత పాఠశాల, జాజాపూర్


