నేరాల నియంత్రణకు చర్యలు
నారాయణపేట: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ వినీత్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, గ్రేవ్, నాన్ గ్రేవ్, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దర్యాప్తులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి త్వరగా కేసులు పరిష్కరించాలన్నారు. పెండింగ్ కేసులు తగ్గించేందుకు న్యాయ, వైద్య అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తిచేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, షీటీం, స్థానిక పోలీసులు, ప్రజలకు సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రాంతి పండుగకు ప్రజలు ఊర్లకు వెళ్తుంటారని, చోరీలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. నీతి నిజాయితీగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా డీటీఓ అధికారులతో కలిసి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన డీఎంహెచ్‌ఓ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, రెవెన్యూ అధికారులను ఎస్పీ శాలువాలతో సత్కరించి పూల మొక్కలు అందించి అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, డీఎంహెచ్‌ఓ డా. జయచంద్రమోహన్, ఆర్టీఓ మెగాగాంధీ, రిటైర్డ్ రెవెన్యూ అధికారి బాలాజీ సఫారీ, సీఐలు శివశంకర్, రాజేందర్‌రెడ్డి, రాంలాల్, సైదులు, ఎస్‌ఐలు వెంకటేశ్వ ర్లు, రాజు, రాముడు, విజయ్‌కుమార్, బాలరాజు, రాజశేఖర్, అశోక్‌బాబు, రమేష్, రాము, నవీద్, సు నీత, గాయత్రి, రేవతి, మహేశ్వరి పాల్గొన్నారు.


