పర్యావరణానికి ముప్పులేదు..
నారాయణపేట: మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపడితే ఈ ప్రాంతంలో ఎలాంటి పర్యావరణ ముప్పు.. విఘాతం కలగడం లేదని, వీలైనంత త్వరగా ఆ పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చి ప్రారంభించాలని ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం మక్తల్ –నారాయణపేట –కొడంగల్ ఎత్తిపోతల పథకంపై జిల్లాలోని దామరగిద్ద తండాలో గురువారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పిసిబి) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఈఈ సురేష్ హాజరు కాగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్, నీటి పారుదల శాఖ ఎస్. ఈ శ్రీధర్ సమక్షంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని 7 మండలాల నుంచి ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఏకాభిప్రాయాన్ని బృందం ముందు వెల్లడించారు. వందలాది మంది సమక్షంలో 28 మంది తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను త్వరగా ప్రారంభించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని, ఆ పథకం పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని ఆకాంక్షించారు. ఈ పథకంతో పర్యావరణానికి వచ్చే నష్టం ఏమీ లేదని, గాలి, నీరు, వాతావరణ కాలుష్యం ఏమీ జరగదని తేల్చి చెప్పారు. ఆ పథకం పూర్తి అయితే పర్యావరణం ఇంకా మెరుగు అవుతుందన్నారు. వెంటనే పథకం ప్రారంభించేందుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని అధికారి సురేష్ ను వారు కోరారు. కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, పర్యావరణ కన్సల్టెన్సీ కరీముల్లా, దామరగిద్ద తహసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీఓ జయలక్ష్మి, దామరగిద్ద తండా సర్పంచ్ శరణ్ నాయక్, దామరగిద్ద సర్పంచ్ అద్దన్ కనికిరెడ్డి, బాపన్‌పల్లి శ్రీను, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, రైతులు, రైతు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మక్తల్– పేట– కొడంగల్‌ప్రాజెక్టుకు అనుమతివ్వాలి
ఉద్యమాలు, పోరాటాలతో ప్రాజెక్టు సాధించుకున్నాం
పర్యావరణ శాఖ నుంచి
అనుమతులిచ్చి త్వరగా పూర్తి చేయండి
ఈ ప్రాంతానికి
సాగు, తాగునీరు అందించాలి
పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించిన ప్రజలు
మూడు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల నుంచి హాజరు
పర్యావరణానికి ముప్పులేదు..


