ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించండి
నారాయణపేట: ఎలాంటి తప్పిదాలు లేని తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో మున్సిపల్ తుది ఓటరు జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించిన అభ్యంతరాలపై చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబి తా స్వచ్ఛత, కచ్చితత్వం ప్రజాస్వామ్యానికి కీలకమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా.. అర్హత లేని పేర్లు తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాల ని కోరారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సమర్పించాలని.. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని నారాయణపేట మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని.. ఏ చిన్న పొరపాటు లేని తుది ఓటరు జాబితాను రూపొందించేందుకు అన్ని పార్టీల నాయకులు సహ కరించాలని ఆయన కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజు, శ్రీకాంత్, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారులు జయసుధ, రాణిదేవి తదితరులు ఉన్నారు.


