నయా జోష్
● నూతనోత్సాహంతో కొత్త సంవత్సర వేడుకలు
● కేరింతలతో యువత, చిన్నారుల సందడి
● కిటకిటలాడిన బేకరీలు.. మద్యం దుకాణాలు
● జిల్లాలో పండుగ వాతావరణం
చరిత్ర పుటల్లో మరో ఏడాది కరిగిపోయింది. ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2025 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోగా.. కోటి ఆశలతో 2026 సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటగానే హ్యాపీ న్యూఇయర్ అంటూ చిన్నారులు, పెద్దలు, యువత ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎటుచూసినా నూతన సంవత్సర వేడుకలతో పండుగ వాతావరణం కనిపించింది. యువకులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. నయా సాల్ జోష్ హోరెత్తింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు, చర్చిలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. స్వీట్ షాపులు, బేకరీలు, మద్యం దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. – నారాయణపేట


