ఎన్నికల నిబంధనలు పాటించాలి
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి పౌరుడు, ప్రతి అభ్యర్థి బాధ్యతతో వ్యవహరించాలని ఎస్పీ వినీత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రివేళ గుంపులుగా తిరగడం, మద్యం సేవించి గొడవలకు దిగడం, ఓటర్లను బెదిరించడం, డబ్బు లేదా బహుమతులతో ప్రభావితం చేయడం వంటి చర్యలు తీవ్ర నేరాలుగా పరిగణించి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అనుమానాస్పద కదలికలు, బెదిరింపులు వస్తే వెంటనే డయల్ 100 నెంబర్ లేదా జిల్లా కంట్రోల్ రూమ్ 8712670399 కు కాల్ చేయాలని తెలిపారు. ఎన్నికల కాలంలో నమోదైన ఏదైనా క్రిమినల్ కేసులు భవిష్యత్‌లో ఉద్యోగాలు, పాస్‌పోర్ట్, విదేశీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనున్న నేపథ్యంలో కోస్గి, గుండుమల్, కొత్తపల్లి, మద్దూర్ మండలాల్లో డిసెంబర్ 9న సాయంత్రం 5 గంటల నుండి ఫలితాలు ప్రకటించే వరకు సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమల్లో ఉంటుందని, నలుగురికి మించి గుంపుగా చేరడం పూర్తిగా నిషేధమని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు డిసెంబర్ 9న సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే వరకు ఆయా మండలాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఎస్పీ తెలిపారు.


