డయల్ యువర్ ఎస్పీకి అనూహ్య స్పందన
నారాయణపేట: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది ఫోన్ ద్వారా ఎస్పీ డా.వినీత్‌ను నేరుగా సంప్రదించి.. తమ సమస్యలను తెలియజేశారు. అందులో ఎక్కువగా భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. అదే విధంగా జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ కమాన్ వైపు వెళ్లే రూట్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ సమయం పెంచాలని, గూడ్స్ వాహనాలను రోడ్లపై ఎక్కువగా నిలుపుతున్నారని, పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని భయపెడుతున్నారని.. పోలీసు రక్షణ కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే మార్గంలో లైటింగ్ లేదని, ప్రాపర్టీ దొంగతనం కేసులో రికవరీ చేయలేదని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ.. చట్టప్రకారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత అధికారులు పూర్తి దర్యాప్తు చేపట్టి.. పరిష్కారానికి చేపట్టిన చర్యలపై ఎస్పీ కార్యాలయానికి రిపోర్టు పంపించాలని ఆదేశించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థ మరింత చేరువయ్యే అవకాశం కలగడంతో పాటు ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఎస్పీ తెలిపారు.


