నేరాల నియంత్రణలో హోంగార్డులది కీలక పాత్ర
నారాయణపేట: నేరాల నివారణలో, కమ్యూనిటీ పోలీసింగ్‌లో, అత్యవసర సేవల్లో హోంగార్డుల పాత్ర అపారమైందని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో హోంగార్డుల రైజింగ్‌డేను పురస్కరించుకొని శనివారం హోంగార్డులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా భద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ వంటి కీలక రంగాల్లో హోంగార్డులు నిబద్ధతతో సేవలు అందిస్తున్నారన్నారు. వారి సేవలకు పోలీస్ శాఖ తరపున పూర్తి మద్దతు ఉంటుందని, బాగా పని చేసిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. పోలీసులతోపాటు విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతతో పనిచేయాలన్నాపారు. హోం గార్డుల ఆరోగ్యం, ఫిట్నెస్, టీమ్ స్పిరిట్ పెంపునకుగాను వాలీబాల్, కబడ్డీ, పరుగు తదితర క్రీడా పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి ఎస్పీ మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, హోం గార్డ్స్ ఇన్‌చార్జి మద్దయ్య, ఆర్‌ఎస్‌ఐ శ్వేత పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల మాక్ డ్రిల్
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన నేపథ్యంలో పోలీసులకు మాక్‌డ్రిల్ నిర్వహించినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ప్రత్యేక సాయుధ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించగా.. ఎస్పీ పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు సిబ్బంది అనుసరించాల్సిన విధానాలు, కార్యాచరణ ప్రణాళికలు, గందరగోళ లేదా అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు తక్షణ స్పందన సామర్థ్యం, ప్రజల ప్రాణ రక్షణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందన్నారు. ఇలాంటి మాక్ డ్రిల్‌లు క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా సిబ్బంది స్పందనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు.
ఎన్నికల జనరల్ అబ్జర్వర్‌ను కలిసిన ఎస్పీ
ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సీత లక్ష్మీని కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ వినీత్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఎన్నికల భద్రతా ఏర్పా ట్లు, బందోబస్తు ప్రణాళిక, సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన చర్యలపై ఎస్పీ వివరించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా తీసుకుంటున్న చర్యలను అబ్జర్వర్‌కి వివరించారు.


