ఒడిశా సీఎంను కలిసిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్: ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మజ్హిని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం కలిశారు. 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా ఆయనను కలిసి ఆహ్వానించారు. ఈమేరకు శనివారం భువనేశ్వర్‌లో ఒడిశా సీఎంను మంత్రి కలిశారు.
రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం
నారాయణపేట: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన పోలీస్ అధికారుల సమావేశంలో జడ్జి మాట్లాడారు. ఈ నెల 13న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ 21కి వాయిదా పడిందని తెలిపారు. జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఈ పెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర కేసుల గురించి ఆరా తీశారు. మొత్తం 5వేల కేసులను ఈ లోక్‌అదాలత్‌లో క్లియర్ చేయాలని, అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని, కార్యక్రమాన్ని కక్షిదారులు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. హై కోర్ట్ జడ్జి ఆదేశానుసారం ముందుగా పెండింగ్ కేసులను పరిష్కారం చెయ్యాలని పోలీస్ అధికారులకు తెలిపారు. ప్రిన్సిపల్ జూ.సివిల్ జడ్జి బి మనోజ్, జూ.సివిల్ జడ్జి అవినాష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సురేష్‌కుమార్ పాల్గొన్నారు.


