నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఔట్‌ సోర్సింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఔట్‌ సోర్సింగ్‌

Nov 25 2025 5:48 PM | Updated on Nov 25 2025 6:13 PM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్‌ సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లు సిబ్బంది మధ్య తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ మేరకు ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఎంగేజ్‌ చేస్తున్నట్లు జీఓ 1626ను ఈనెల 15న జారీ చేసింది. అయితే ఈ జీఓను నాన్‌టీచింగ్‌ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేస్తున్న వారు ఉండగా.. మరికొంతమంది 2014 కంటే ముందు విధుల్లో చేరి జీఓ ప్రకారం వేతనాలు ఇవ్వకపోయినా నేరుగా యూనివర్సిటీ కిందే విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సోమవారం నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రిజిస్ట్రార్‌ రమేష్‌బాబును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో పనిచేసిన పలువురు వైస్‌ చాన్స్‌లర్లు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేయాలని ఒత్తిడి తీసుకొస్తే 21 రోజులపాటు ధర్నా చేపట్టి.. ఆ విధానంలోకి వెళ్లలేదని పీయూ రిజిస్ట్రార్‌కు తెగేసి చెప్పారు. జీఓలో ఔట్‌సోర్సింగ్‌ విధానం అని చెప్పి ఏ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారానో వేతనాలు ఇవ్వకూడదని, నేరుగా యూనివర్సిటీ లేదా, ట్రెజరీ నుంచి ఇవ్వాలని కోరారు.

ఆ విధానంతో నష్టం..

ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేయడం వల్ల తీవ్రనష్టం జరుగుతుందని నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు యూనివర్సిటీ కింద తాత్కాలిక సిబ్బంది లేదా అడ్‌హక్‌ పద్ధతిలో పనిచేస్తూ వచ్చిన సిబ్బందిని ఇప్పుడు నేరుగా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు సమస్య వస్తే నేరుగా యూనివర్సిటీ అధికారులను చెప్పుకొనేందుకు అవకాశం ఉండేదని, ఇప్పుడు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగిస్తే ఏజెన్సీ కాంట్రాక్టర్‌ చెప్పినట్లు వినాల్సి వస్తుందని సిబ్బంది భయపడుతున్నారు. జీఓ ప్రకారం వేతనాలు ఇచ్చినప్పటికీ ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌, జీఎస్టీ, ఏజెన్సీ కమీషన్‌ వంటివి వేతనాల్లో కోత విధించి అరకొర వేతనాలు మాత్రమే చేతిలో పెడతారని, అందుకు తాము ఒప్పుకొనేది లేదని తెగేసి చెబుతున్నారు. 2014 తర్వాత పలువురు సిబ్బందిని అవసరం మేరకు గతంలో తీసుకున్న అధికారులు నేరుగా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగించారు. అయితే 2014 కంటే ముందు విధుల్లో చేరిన వారు సుమారు 75 మందికిపైగా ఉన్నారని వారిని నేరుగా కాంట్రాక్టు విధానంలో తీసుకోవాలని నాన్‌టీచింగ్‌ సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.

కేటగిరీల వారీగా విభజన..

జీఓ 1626 ప్రకారం మొత్తం 512 మంది సిబ్బందిని ఎంగేజ్‌ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 38, సెల్ప్‌ ఫైనాన్స్‌ ద్వారా పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 24, అకాడమిక్‌ కన్సల్టెంట్లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 34 ఉన్నారు. పార్ట్‌ టైం ద్వారా మరో 66 మంది పనిచేస్తున్నారు. వీరికి వేతనాలను జీఓ 60, 11 ప్రకారం చెల్లిస్తున్నారు. అలాగే ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న వారు మొత్తం 350 మంది ఉన్నారు. రూ.19,500 వేతనం స్లాబ్‌లో వంద మంది, రూ.15,500 వేతనం స్లాబ్‌లో 236 మంది, రూ.22,750 వేతనం స్లాబ్‌లో 14 మంది ఉన్నారు.

పీయూలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి బదలాయింపునకు చర్యలు

వచ్చే ఏడాది మార్చి వరకు ఎంగేజ్‌ చేస్తూ జీఓ జారీ

తమను సంప్రదించకుండా ఎలా విలీనం చేస్తారని సిబ్బంది ఆవేదన

అన్యాయం చేయొద్దని పీయూ రిజిస్ట్రార్‌కు వేడుకోలు

నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఔట్‌ సోర్సింగ్‌ 1
1/1

నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఔట్‌ సోర్సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement