పటేల్ జీవితం యువతకు ఆదర్శం
నారాయణపేట రూరల్: దేశాన్ని ఏక ఖండ భార తంగా రూపుదిద్దడంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మనలో సమైక్యతా స్ఫూర్తిని నింపిన మహానుభావుడని ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని బారంబావి నుంచి మినీ స్టేడియం వరకు 4కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ చరిత్రలో చిరస్మరణీయ నేత అని కొనియాడారు. భారత స్వతంత్ర సమరయోధుడు, రాజనీతిజ్ఞుడిగా సమాజంలో అపార సేవలందించారని తెలిపారు. స్వతంత్ర భారత్‌కు తొలి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పటేల్ 530కుపైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించారని, అందుకే ఆయనను ఉక్కు మనిషిగా చిరస్మరణీయుడిగా నిలిచారన్నారు. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ నిర్మాణంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత ఉత్సాహంగా 4కే రన్‌లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో రన్నింగ్ వంటి క్రీడలకు పెద్దపీట వేయాలని సూచించారు.
డ్రగ్స్‌కు దూరంగా..
యువత గంజాయి, ఇతు మత్తు పదార్థాలతో పాటు సైబర్ నేరాలకు పాల్పడడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎంపీ, కలెక్టర్ సూచించారు. మత్తుకు బానిసై ఎన్నో కుటుంబాలు చీకటిలో మునిగిపోతున్నాయని, యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, నాయకులు నాగురావు నామాజీ, రతంగ్‌పాండు రెడ్డి, ఉమ్మడి జిల్లా యువజన అధికారి కోటానాయక్, కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, డీఈఓ గోవిందురాజు, తపస్ జిల్లా అధ్యక్షుడు షేర్ కృష్ణారెడ్డి, డీవైఎస్‌ఓ వెంకటేష్ శెట్టి, ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.


