ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులకు తగిన ప్రాధాన్యతనిస్తూ సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలను అందజేశారు. వారి సమస్యలను వినడంతో పాటు అర్జీలను స్వీకరించిన అదనపు కలెక్టర్, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణిలో 20 ఫిర్యాదులు అందాయి.
నేటి నుంచి గీతా జ్ఞానయజ్ఞం ప్రారంభం
నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానం శక్తి పీఠంలో మంగళవారం నుంచి డిసెంబర్ 1, సోమవారం వరకు గీతా జ్ఞాన యజ్ఞం–భగవద్గీత సప్తాహా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శక్తి పీఠం ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ గీతా జ్ఞాన యజ్ఞం ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామి శాంతానంద సభ మండపంలో జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శక్తి పీఠం ట్రస్ట్ సభ్యులు దోమ సుధాకర్, నంది రాజశేఖర్, కర్నె గంగాధర్‌రెడ్డి కోరారు.
‘బీజేపీ కార్యకర్తలజోలికొస్తే సహించం’
కోస్గి: కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నామనే దీమాతో బీజేపీ కార్యకర్తల జోలికి వస్తామంటే చూస్తు ఊరుకోబోమని, దాడులకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంపీ డీకే అరుణ హెచ్చరించారు. మండలంలోని మీర్జాపూర్ చెందిన బీజేపీ నాయకుడు రమేష్ తన ఇంటి గేటుకు కమలం పువ్వు గుర్తు వేసుకొని, బీజేపీ అని రాసుకోవడంతో అదే గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం రాత్రి రమేష్ ఇంటిపై దాడి చేశారు. వెంటనే గేట్‌కు వేసిన బీజేపీ గుర్తును తీసివేయాలని వాగ్వాదానికి దిగి రమేష్‌తో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అరుణ స్థానిక నాయకులతో కలిసి సోమవారం మీర్జాపూర్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం పోలీసులతో ఫోన్‌లో మాట్లాడి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితువు పలికారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిదాడులు చేస్తే తట్టుకోలేరని అధికార పార్టీ నాయకులను హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రాష్ట్ర నాయకులు నాగురావ్ నామాజీ, రతంగ్‌పాండు రెడ్డి, లక్ష్మీశ్యాంసుందర్ గౌడ్, నాయకులు ప్రతాప్‌రెడ్డి, వార్ల అంజయ్య, ప్రశాంత్, పద్మ, కోటకొండ రాము, నర్సిములు, శ్రీకాంత్, యాదయ్య, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


