క్రీడలతో మానసికోల్లాసం
నారాయణపేట: యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్పీ స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్‌లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్పీ క్రీడాకారులను పరిచయం చేసుకొని, టాస్ వేసి మొదటి మ్యాచ్‌ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ క్రికెట్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసికోల్లాసాన్ని పెంచడానికి మంచి సాధనంగా ఉంటాయని తెలిపారు. యువతలో ప్రతిభను వెలికితీయడం, వ్యక్తిత్వాన్ని నిర్మించడం కోసం ఇలాంటి పోటీలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. మెగా క్రికెట్ టోర్నమెంట్‌లో జిల్లా వ్యాప్తంగా 30 జట్లు పాల్గొంటుండటంతో పాటు రెవెన్యూ, పోలీసు, మీడియా, డాక్టర్లు, లాయర్ జట్లు పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని యువత టీమ్‌లు పోటీపడుతున్న ఈ వేదిక ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


