
ప్రారంభానికి ‘ట్రిపుల్ ఐటీ’ సిద్ధం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మక బాసర ఐఐఐటీ కళాశాలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయనుంది. దీంతో పాలమూరు చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానునుంది. కళాశాల ఏర్పాటుకు అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా కళాశాల ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడ విద్యార్థులకు, ప్రత్యేక తరగతి గదులతోపాటు అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరికి హాస్టల్ గదులు, డైనింగ్ హాల్ వంటివి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కళాశాలను ప్రారంభించి.. అక్కడే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. రెగ్యులర్ కళాశాల భవనం కోసం జిల్లాకేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద 40 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వీటిలో త్వరలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టనున్నారు.
అవకాశాలతో మేలు..
సాధారణంగా ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఎఫ్ సెట్ వంటి పోటీ పరీక్షలు రాస్తే సీటు లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఐఐఐటీలో ఎస్సెస్సీ పూర్తయిన తర్వాత నేరుగా మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ను పొందవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సులు కావడంతో 2 ప్లస్ 4 విధానంలో విద్యాబోధన జరుగుతుంది. మొదటి రెండేళ్లు అందరికీ కామన్ సిలబస్ ఉండగా.. తర్వాత మరో నాలుగేళ్లు వివిధ డిపార్ట్‌మెంట్‌లు విడిగా తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఇందులోనే ఇంటర్‌తోపాటు ఇంజినీరింగ్ విద్య కూడా పూర్తి అవుతుంది. ఒక విద్యార్థి ఎస్సెస్సీ తర్వాత అడ్మిషన్ పొందితే నేరుగా ఇంజినీరింగ్ సర్టిఫికెట్‌తో బయటికి వచ్చి.. ఉద్యోగం పొందేందుకు సంసిద్ధంగా ఉంటారు.
ఐఐఐటీ కళాశాలలో గదులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీ కళాశాల
ఆన్‌లైన్ విధానంలోనే..
ఐఐఐటీ కళాశాల ఏర్పాటు మొదటి సంవత్సరం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా యూనివర్సిటీ నుంచి నేరుగా ఆన్‌లైన్ విధానంలో జరిగింది. ఈ మేరకు ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన 208 మంది విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం 144 మంది బాలికలు, 64 మంది బాలురకు అవకాశం కల్పించారు. ఇక స్టాఫ్ నియామకాల ప్రక్రియను సైతం అధికారులు పూర్తిచేశారు. గత నెల టీచింగ్ సిబ్బంది నియామకానికి ప్రకటన ఇవ్వగా.. 31 మంది దరఖాస్తు చేసుకుంటే 9 మందిని వివిధ డిపార్ట్‌మెంట్లకు సంబంధించి అధ్యాపకులను భర్తీ చేశారు. మరో 6 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని సైతం నియమించినట్లు తెలుస్తోంది. ఇందులో వార్డెన్లు, అటెండర్లు, స్వీపర్ ఇతర సిబ్బంది ఉన్నారు.
వచ్చేవారం ఓరియంటేషన్ కార్యక్రమాల నిర్వహణ
ఇప్పటికే ఎస్సెస్సీ మెరిట్ ఆధారంగా 208 మందికి అడ్మిషన్లు
ఇంటర్మీడియట్‌తోపాటు ఇంజినీరింగ్‌చదివేందుకు వెసులుబాటు
బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్‌భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు
టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది నియామకాలు చేపడుతున్న బాసర అధికారులు

ప్రారంభానికి ‘ట్రిపుల్ ఐటీ’ సిద్ధం

ప్రారంభానికి ‘ట్రిపుల్ ఐటీ’ సిద్ధం