
సీవీఆర్ ఆశయ సాధనకు కృషి
నారాయణపేట: తన తండ్రి, ఉమ్మడి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దివంగత చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సీవీఆర్ 60వ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని న్యూగంజ్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట ఆధ్వర్యంలో సీవీఆర్ భవన్‌లో ఎమ్మెల్యే తన సోదరుడు, టీపీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డితో కలిసి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యశిబిరాలు, రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తన తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్‌తో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువకులు ముందుకొచ్చి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సీవీఆర్ అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు సరిత, గవర్నర్ హరినారాయణ్ బట్టడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, వైస్‌చైర్మన్ కొనంగేరి హన్మంతు, డైరెక్టర్ బోయ శరణప్ప, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సలీం, మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.