
కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి
నారాయణపేట క్రైం: జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకొని మత సామరస్యాన్ని చాటాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ కోరారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. రాబోయే వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. అందుకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పెద్దలు, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డీజేలను నిషేధించడం జరిగిందని.. ఉత్సవాల్లో అందరూ పాటించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి డీజేలు పెడితే సీజ్ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా మతపరమైన జెండాలు కట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పండుగల సమయంలో ఏమైన సమస్యలు ఏర్పడితే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.